15 ఏళ్లలో 3.78 లక్షల యూకే కార్ల దిగుమతికి అనుమతి
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:58 AM
భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో...
110 శాతం నుంచి 10 శాతానికి తగ్గనున్న దిగుమతి సుంకం
జూలై 15 నుంచి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం అమల్లోకి..
న్యూఢిల్లీ: భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి సంప్రదాయ ఇంధన ఇంజన్‌తో కూడిన 3.78 లక్షల యూనిట్ల ప్యాసింజర్ కార్లను దిగుమతి చేసుకునేందుకు భారత్ అనుమతించనుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం యూకే కార్లపై దిగుమతి సుంకం వాహన విభాగం ఆధారంగా దాదాపు 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది. అయితే, ఇరువైపులా వాహన వార్షిక దిగుమతులకు లోబడి ఈ సుంకం రాయితీ వర్తించనుంది. తొలి ఏడాదిలో స్మాల్, మిడ్, హైఎండ్ ఇంజన్ సామర్థ్య (1,500 సీసీ నుంచి 3,000 సీసీకి పైగా) విభాగాలకు చెందిన 20,000 యూకే కార్ల దిగుమతికి భారత్ అనుమతించనుంది. ఐదో సంవత్సరం నాటికి ఈ పరిమితి 37,000 యూనిట్లకు చేరుకోనుంది. మరోవైపు ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్‌కు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లను యూకేకు ఎగుమతి చేసే అవకాశం లభించింది. ఒప్పందం అమల్లోకి వచ్చిన ఆరో సంవత్సరం నుంచి ఎలాంటి సుంకం చెల్లించనవసరం లేకుండా 20,000 నుంచి 80,000 పౌండ్ల వరకు విలువ చేసే కార్లను భారత కంపెనీలు యూకేకు ఎగుమతి చేయవచ్చు. 15వ సంవత్సరం నాటికి వార్షిక ఎగుమతుల కోటా 88,000 యూనిట్లకు చేరనుంది.
95% భారతీయ నిపుణులకు లబ్ధి
భారత్-యూకే మధ్య కుదిరిన సామాజిక భద్రత ఒప్పందంతో యూకేలో పనిచేస్తున్న 90-95 శాతం మంది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరనుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (డీసీసీ) లేదా సోషల్ సెక్యూరిటీ ఒప్పందంతో బ్రిటిష్ మార్కెట్లో భారతీయ కంపెనీల మధ్య పోటీతత్వం పెరగటమే కాకుండా వ్యయాలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసి్‌సకు ఇది ఎంతగానో మేలు చేకూర్చనుందని పేర్కొన్నాయి. యూకే సోషల్ సెక్యూరిటీ కోసం ఏటా భారతీయ నిపుణులు 50 కోట్ల డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానున్న తాజా ఒప్పందంతో కంపెనీలు భారత్ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు ఉద్యోగులను తాత్కాలికంగా బదిలీ చేయవచ్చు. అంతేకాకుండా ఐదేళ్ల వరకు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ మొత్తాలను చెల్లించకుండా మినహాయింపు లభించనుంది. ఇప్పటి వరకు యూకేలో పనిచేస్తున్న భారత నిపుణులకు వార్షిక వేతనం 40,000-50,000 పౌండ్లు ఉంటే అందులో 15 శాతం మొత్తాన్ని సామాజిక భద్రత కోసం చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం బ్రిటన్‌లో 900 భారతీయ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా అందులో 75,000 మంది నిపుణులు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..