రోజుకు రూ.4,076 కోట్లు
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:42 AM
దేశంలోని అత్యంత విలువైన 300 కుటుంబ వ్యాపారాలు సృష్టించిన మొత్తం సంపద రూ.138 లక్షల కోట్లకు చేరుకుందని బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితా...
దేశంలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలు గడిచిన రెండేళ్లలో సృష్టించిన సగటు సంపద ఇది..
వాటి మొత్తం విలువ రూ.138 లక్షల కోట్లు
నెదర్లాండ్స్, సౌదీ, స్విస్, పోలండ్ జీడీపీ కంటే అధికం
అంబానీదే అత్యంత విలువైన వ్యాపార కుటుంబం
తొలి తరం కుటుంబ వ్యాపారుల్లో అదానీ టాప్
2026 జాబితా విడుదల చేసిన బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత విలువైన 300 కుటుంబ వ్యాపారాలు సృష్టించిన మొత్తం సంపద రూ.138 లక్షల కోట్లకు చేరుకుందని బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితా వెల్లడించింది. ఇది ప్రపంచంలోని 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానమని.. నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలండ్ జీడీపీ కంటే అధికమని రిపోర్టు పేర్కొంది. గడిచిన రెండేళ్ల కాలంలో (2024 సంవత్సరం జాబితా విడుదల సమయంతో పోలిస్తే) నిఫ్టీ 1.1 శాతం, సెన్సెక్స్ 3.7 శాతం క్షీణించినప్పటికీ, ఈ 300 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ మాత్రం దాదాపు రూ.30 లక్షల కోట్లు (27.5 శాతం) పెరిగిందని నివేదిక వెల్లడించింది. అంటే, సగటున రోజుకు రూ.4,076 కోట్ల సంపద సృష్టించాయని తెలిపింది. మరిన్ని ముఖ్యాంశాలు..
దేశంలోని అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల్లో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో ఉంది. వీరికి చెందిన రిలయన్ ఇండస్ట్రీస్ విలువను రూ.25.82 లక్షల కోట్లుగా బార్‌క్లేస్ లెక్కగట్టింది. గత ఏడాది కాలంలో రిలయన్స్ విలువ 8.5 శాతం క్షీణించినప్పటికీ, ముకేశ్ కుటుంబం జాబితాలోని మిగతా వారికి అందనంత ఎత్తులో ఉండటం గమనార్హం.
రూ.8.14 లక్షల కోట్లతో కుమార మంగళం బిర్లా కుటుంబం రెండో స్థానంలో ఉంది. ఈ కుటుంబ వ్యాపారాల విలువ గత ఏడాది కాలంలో 26 శాతం పెరిగింది. 40 శాతం వృద్ధితో రూ.8.02 లక్షల కోట్లకు చేరిన జిందాల్ కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. బజాజ్ ఫ్యామిలీ (రూ.7.7 లక్షల కోట్లు), మహీంద్రా కుటుంబం (రూ.5.5 లక్షల కోట్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
అంబానీ, బిర్లా, జిందాల్ కుటుంబ వ్యాపారాల మొత్తం విలువే రూ.42 లక్షల కోట్లు. భారత స్టాక్ మార్కెట్లోని మొత్తం లిస్టెడ్ కంపెనీల విలువలో ఇది దాదాపు 9 శాతానికి సమానం.
జాబితాలోని 300 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువలో టాప్- 10 కుటుంబాల వాటాయే 51ు ఉంది.
మైనింగ్ మొఘల్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్ విలువ 75ుపెరిగి రూ.4.45 లక్షల కోట్లకు చేరింది. గత మూడేళ్లలో సంపద 212ు పెరిగింది.
తొలితరం కుటుంబాల వ్యాపారాల విలువ రూ.77.8 లక్షల కోట్లు
దేశంలోని టాప్-100 తొలితరం కుటుంబ వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేక జాబితాను సైతం ఈసారి రూపొందించింది. ఆ వంద కుటుంబాల వ్యాపారాల మొత్తం విలువ రూ.77.8 లక్షల కోట్లుగా ఉంది. అందులో రూ.19.6 లక్షల కోట్లతో అదానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ భారతీ మిట్టల్ (రూ.12.1 లక్షల కోట్లు), సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సంఘ్వీ (రూ.4.55 లక్షల కోట్లు), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పూనావాలా (రూ.2.98 లక్షల కోట్లు), డీమార్ట్ సూపర్ మార్కెట్ల అధిపతి రాధాకిషన్ దమానీ (రూ.2.86 లక్షల కోట్లు) కుటుంబాలు వరుసగా 2, 3, 4, 5వ స్థానాల్లో నిలిచాయి.
రెండు జాబితాలను కలిపితే, 400 కుటుంబ వ్యాపారాల మొత్తం విలువ రూ.215.8 లక్షల కోట్లుగా ఉంది.
జాబితాలో కనీసం బిలియన్ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.9,500 కోట్లు) విలువైన వ్యాపారాలను నిర్వహిస్తున్న 230 కుటుంబాలున్నాయి. గత ఏడాది లిస్ట్‌తో పోలిస్తే ఈ సంఖ్య 48 శాతం పెరిగింది.
హైదరాబాద్‌లో 9 కుటుంబాలు
అత్యంత విలువైన వ్యాపార కుటుంబాలు ముంబైలో అత్యధికంగా 95 ఉన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 58, కోల్‌కతాలో 26 ఉన్నాయి. హైదరాబాద్‌లో 9 కుటుంబాలుఉన్నాయి. ఇందులో దివీస్ లేబొరేటరీస్ మురళి దివి, జీఎంఆర్ గ్రూప్ జీఎం రావు, అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సీ రెడ్డి, అరబిందో ఫార్మా రామ్‌ప్రసాద్ రెడ్డి, ఎంఈఐఎల్ పీపీ రెడ్డి, లారస్ ల్యాబ్స్ చావా సత్యనారాయణ కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి.
తొలితరం కుటుంబ వ్యాపారాల విషయానికొస్తే, హైదరాబాద్ నుంచి 15 కంపెనీలకు చోటు దక్కింది. ముంబై నుంచి 24, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నుంచి 18 సంస్థలున్నాయి.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..