Share News

విదేశీ పెట్టుబడులకు మరింత ఊతం

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:28 AM

విదేశీ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుత పన్నుల చట్టాలను సవరిస్తూ కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం..

విదేశీ పెట్టుబడులకు  మరింత ఊతం

  • దేశీయ తయారీకి దన్ను

  • డేటా కేంద్రాలకు ప్రోత్సాహకాలు

  • కాంట్రాక్టు తయారీ సంస్థలకూ పన్ను మినహాయింపు

  • లోక్‌సభలో టాక్సేషన్‌ చట్టాల (సవరణ) బిల్లు

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుత పన్నుల చట్టాలను సవరిస్తూ కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ‘పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026’ పేరుతో ఈ ప్రత్యేక బిల్లును రూపొందించారు. ఈ సవరణ బిల్లు ద్వారా దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే విదేశీ సంస్థలు, మదుపరులకు విశ్వసనీయమైన కచ్చితమైన విధానాలతో కూడిన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్టుబడులకు ముందుకు వచ్చే విదేశీ కంపెనీలకు పలు పన్ను రాయితీలు,మినహాయింపులు ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే విదేశీ పెట్టుబడులుపుంజుకుని దేశీయ తయారీ మరింత పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. బిల్లు ప్రధాన అంశాలు..

విదేశీ మూలధన ఆకర్షణ: ప్రస్తుతం అనేక మంది ఫండ్‌ మేనేజర్లు తమ గ్లోబల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ను విదేశాల నుంచి నిర్వహిస్తున్నారు. భారత్‌ నుంచే తమ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన నిబంధనలు, అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందనే భయం ఇందుకు ప్రధాన కారణం. ఈ సవరణ బిల్లు ద్వారా నిబంధనలను సులభతరం చేయడంతో పాటు వీరు భారత్‌ నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తే గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలోని సంస్థలకు కల్పించే పన్ను రాయితీలన్నీ కల్పిస్తామని ప్రతిపాదించారు.

డేటా సెంటర్లకు ఊతం: భారత్‌లోని సొంత డేటా సెంటర్ల సేవలను ఉపయోగించుకునే విదేశీ క్లౌడ్‌ కంపెనీలకు ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. అయితే అది అనేక షరతులు, ఆమోదాలకు లోబడి ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని తొలగించి లీజుకు తీసుకున్న డేటా సెంటర్ల నుంచి సేవలు అందుకునే విదేశీ క్లౌడ్‌ కంపెనీలకు కూడా పన్ను మినహాయింపు వర్తింప చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. దీంతో విదేశీ క్లౌడ్‌ కంపెనీలు పెద్దఎత్తున మన దేశంలో తమ ఏఐ డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని భావిస్తున్నారు.

రీట్స్‌, ఇన్విట్స్‌ మదుపరులకు ఊరట: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్టులు (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్టు (ఇన్విట్స్‌)ల మదుపరులకు ఈ బిల్లులో ప్రత్యేక ఊరట కల్పించారు. వీటిని నిర్వహించే కంపెనీలు కొత్త ఆదాయ పన్ను విధానానికి మారినా, వాటి నుంచి మదుపరులకు అందే డివిడెండ్లకు పన్ను మినహాయింపు కొనసాగనుంది. దీంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రీట్స్‌, ఇన్విట్స్‌ పెట్టుబడులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.


ఎలకా్ట్రనిక్‌ పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం: మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యా్‌పలు, పర్సనల్‌ కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, సర్వర్ల వంటి నిర్దేశిత కీలక ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, వాటి విడిభాగాల దేశీయ ఉత్పత్తికీ ఈ సవరణ బిల్లులో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. కాంట్రాక్టు పద్దతిలో దేశీయ కంపెనీల ద్వారా వీటిని తయారు చేయించుకునే విదేశీ కంపెనీలకూ 2040-41 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. దేశంలోని కస్టమ్స్‌ గోదాముల్లో నిల్వ చేసుకుని ఈ కీలక ఎలకా్ట్రనిక్‌ వస్తువుల తయారీకి అవసరమైన విడి భాగాలను, దేశీయ కాంట్రాక్టు తయారీ కంపెనీలకు సరఫరా చేసే విదేశీ కంపెనీలకు కూడా 2040-41 వరకు ఈ పన్ను మినయింపు లబించనుంది.

యూపీఐ చెల్లింపులపై భారం!

పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026 లో భాగంగా 2007 నాటి పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టాన్ని కూడా సవరించాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎలకా్ట్రనిక్‌ పేమెంట్‌ సేవల కోసం బ్యాంకులు గానీ, పేమెంట్‌ సేవల సంస్థలు గానీ ఎలాంటి చార్జీలు (ఎండీఆర్‌) వసూలు చేసేందుకు వీల్లేదు. అయితే ఈ సవరణ బిల్లు ద్వారా వార్షిక టర్నోవర్‌ రూ.50 కోట్లకు మించి ఉన్న వ్యాపార సంస్థల నుంచి ఎండీఆర్‌ చార్జీల వసూలుకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఇదే జరిగితే వ్యాపార సంస్థలు ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేసే అవకాశం ఉంది. ఈ భారం భరించలేక కొనుగోలుదారులు తమ చెల్లింపుల కోసం డెడిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఆశ్రయిస్తారని పరిశ్రమ వర్గాల అంచనా. అదే జరిగితే దేశంలో యూపీఐ చెల్లింపులు 50 శాతం వరకు పడిపోతాయని అంచనా.

Also Read:

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

Updated Date - Aug 05 , 2026 | 05:28 AM