Share News

చుక్కల్లో ధరలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:06 AM

అక్టోబరు నెలలో దేశంలో ధరల సెగ చుక్కలనంటింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా 6.09 శాతానికి చేరింది. ఇది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌...

చుక్కల్లో ధరలు

రెండేళ్ల గరిష్ఠ స్థాయికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

అక్టోబరులో 6.09 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: అక్టోబరు నెలలో దేశంలో ధరల సెగ చుక్కలనంటింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా 6.09 శాతానికి చేరింది. ఇది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కు ప్రభుత్వం నిర్దేశించిన 6 శాతం కంటే 0.09 శాతం ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబరులో నమోదైన 5.54 శాతంతో పోల్చినా అక్టోబరు నెల వినియోగదారు ధరల ఆధారిత సూచీ (సీపీఐ) 0.55 శాతం ఎక్కువగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ఈ వివరాలు విడుదల చేసింది. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది తొమ్మిదో నెల. ఈ ఏడాది జనవరిలో నమోదైన 2.74 శాతంతో పోలిస్తే అక్టోబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు రెట్టింపైంది.

అన్ని ఉత్పత్తుల ధరలు పైపైకి

ఆహార, పానీయాల ధరలు, రెస్టారెంట్ల సేవలు, రవాణ ఖర్చులు పెరిగిపోవడం గత నెల రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేర్చాయి. ఈ ధరల పెరుగుదలతో సెప్టెంబరులో 7.74 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరు నెలలో 8.94 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్టోబరులో బంగాళాదుంపల ధరలు 14.24ు, కాలీఫ్లవర్‌ 10.57ు తగ్గాయి. అయితే ఉల్లి ధర 116.22ు, వెల్లుల్లి ధర 60.74ు, అల్లం ధర 48.32ు, నిమ్మకాయల ధర 47.30ు పెరగడంతో ఈ ఏడాది అక్టోబరులో వంటింటి బడ్జెట్‌ను మరింత పెంచాయి.

వడ్డీ రేట్ల పెంపు తథ్యం!

అక్టోబరు నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో.. వచ్చే నెల 2-4 తేదీలల్లో జరిగే ద్రవ్యపరపతి విధాన (ఎంపీసీ) భేటీలో ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపో రేటు పెంచే అవకాశం ఉందని డీబీఎస్‌ బ్యాంక్‌ సీనియర్‌ ఆర్థికవేత్త, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా రావు చెప్పారు. వరుణుడు కరుణించక పోవడంతో పాలు, పంచదార, ఉల్లిపాయల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల డెయిరీ కంపెనీలు లీటర్‌ పాల ధరను రూ.4 నుంచి రూ.6 వరకు పెంచాయి. దీంతో మరో రెండు నెలల పాటు ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో డిసెంబరు భేటీలో ఎంపీసీ రెపో రేటు 0.25ు పెంచడం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని ఇక్రా రేటింగ్స్‌ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అన్నారు. అయితే ఈ పెంపు 0.50ు వరకు ఉండే అవకాశం కూడా ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.


తెలుగు రాష్ట్రాల్లో మరింత సెగ

అక్టోబరు నెల ధరల సెగ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా కనిపించింది. తెలంగాణలో 7.26 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7.25 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైంది. తమిళనాడులో అత్యధికంగా 7.29 శాతంగా నమోదైంది. గత నెల మొత్తం ఆరు రాష్ట్రాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతానికిపైగా నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 04:06 AM