Share News

అమెరికా ఆరోపణలు.. తోసిపుచ్చిన భారత్

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:15 AM

భారత్‌లో అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో తమ దేశ పరిశ్రమలకు నష్టం కలుగుతోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసి పుచ్చింది.

అమెరికా ఆరోపణలు.. తోసిపుచ్చిన భారత్
India Rejects US Tariff Allegations

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో తమ దేశ పరిశ్రమలకు నష్టం కలుగుతోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. తమ దేశంలో అదనపు పారిశ్రామిక ఉత్పత్తి ఏ రంగంలోనూ లేదని తేల్చి చెప్పింది. భారత్‌ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా తాజాగా 25 శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకం 17 శాతంగా ఉంటుందని కూడా యూఎస్ వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) తెలిపారు. పలు దేశాల పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై సెక్షన్ 301 కింద విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


యూఎస్‌టీఆర్ కార్యాలయం ప్రకటన ప్రకారం, భారత్‌లోని అదనపు పారిశ్రామిక సామర్థ్యం కారణంగా అమెరికాలోకి భారీ స్థాయిలో తక్కువ ధరకు ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా అక్కడి పరిశ్రమలకు నష్టం కలుగుతోందని అమెరికా ఆరోపించింది. భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై అదనపు సుంకాన్ని విధించింది.


ఈ విషయంపై యూఎస్ నోటీసులు అందాయని, తాము పరిశీలిస్తున్నామని కేంద్రం పేర్కొంది. అయితే, అమెరికాకు నష్టం చేకూర్చే అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం లేదని పేర్కొంది. దేశీయ అవసరాలకు మించి ఉత్పత్తి అయ్యే వస్తువులను అదనపు పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంగా నిపుణులు చెబుతున్నారు. ఇక 301 సెక్షన్ విచారణకు తాము పూర్తిస్థాయిలో సహకరించామని భారత్ తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో భాగంగానే ఈ అంశాలపై సంప్రదింపులు జరపాలని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ

టాటా సన్స్‌ లిస్టింగ్‌.. ప్రధానికి షాపూర్ మిస్త్రీ లేఖలు

Updated Date - Nov 26 , 2026 | 08:21 AM