2025-26లో పీఎస్‌బీల లాభాలు రూ.2 లక్షల కోట్లకు పైనే
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:28 AM
ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా...
మన బ్యాంకింగ్ వ్యవస్థ భేష్
కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా ఎప్పటికప్పుడు దేశ బ్యాంకింగ్ వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తోందన్నారు. దీంతో అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ఆ ప్రభావం మన బ్యాంకింగ్ వ్యవస్థను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవన్నారు. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.78 లక్షల కోట్లున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) లాభాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లు మించి పోయే అవకాశం ఉందన్నారు.
ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శి
దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మన బ్యాంకింగ్ వ్యవస్థ చక్కటి మార్గదర్శి అని నాగరాజు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల రుణ పంపిణీ 12 శాతం, డిపాజిట్ల వృద్ధి రేటు 10 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పీఎ్‌సబీల మొండి బకాయిల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికానికల్లా పీఎస్‌బీల మొత్తం రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) రికార్డు స్థాయిలో 2.3 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3 శాతానికి తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పెరగనున్న ఎఫ్‌డీఐ
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెంపుపైనా నాగరాజు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం పీఎస్‌బీల ఈక్విటీలో ఎఫ్‌డీఐ 20 శాతం మించకూడదు. అయితే దీన్ని 49 శాతానికి పెంచే విషయాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం
త్వరలో ఉన్నత స్థాయి కమిటీ
బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వీలుగా దేశంలో మూడు లేదా నాలుగు బాహుబలి బ్యాంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకు మరోసారి పీఎస్‌బీల విలీనం చేపట్టబోతున్నారా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం చెప్పలేదు. దీంతో ఈ ఉన్నత స్థాయి కమిటీతో ప్రభుత్వం భారీ మెగా బ్యాంకులను ఎలా స్థాపించనుంది? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్ చంద్ర పోలీసు కస్టడీలో మృతి