వచ్చే ఎఫ్‌డీఐ కంటే పోయేదే ఎక్కువ
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:19 AM
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐతో పోలిస్తే.. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే మన...
న్యూఢిల్లీ: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐతో పోలిస్తే.. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే మన పెట్టుబడులే ఎక్కువగా ఉంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం వివరాలే ఇందుకు ఉదాహరణ. ఆ సంవత్సరం మన దేశంలోకి 8,104 కోట్ల డాలర్ల (సుమారు రూ.7 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ పెట్టుబడులు వచ్చాయి. అదే సంవత్సరం మన దేశం నుంచి విదేశాలకు తరలిపోయిన పెట్టుబడులను తీసివేస్తే చివరికి నికరంగా మన దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐ కేవలం 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,600 కోట్లు) మాత్రమే. లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ విషయం వెల్లడించారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే ఇది 920 కోట్ల డాలర్లు తక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చినా ఇది ఏకంగా 2,700 కోట్ల డాలర్లు తక్కువ. మన దేశం నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు విదేశాలకు తరలి పోవడానికి కేంద్ర మంత్రి ఈ కింది అంశాలను ప్రధాన కారణంగా చెప్పారు.
అంతర్జాతీయంగా ఎదగాలన్న భారతీయ కంపెనీల ఆశలు, సామర్ధ్యాలు
భారత కంపెనీలు విదేశాల్లోని వ్మూహాత్మక ఆస్తులు కొనుగోలు చేయడం
విదేశీ మార్కెట్లు, అధునాతన టెక్నాలజీ దేశీయ కంపెనీలకు అందుబాటులోకి రావడం
విదేశీ కంపెనీలు మన దేశంలోని కంపెనీల్లో తమ వాటా అమ్మి, ఆ సొమ్మును తరలించుకుపోవడం.
2024-25లో నికరంగా వచ్చింది 100 కోట్ల డాలర్లే
2025-26లో కొద్దిగా మెరుగు
అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. ఈ కాలంలో మన దేశానికి వచ్చిన నికర ఎఫ్‌డీఐ 765 కోట్ల డాలర్లకు (సుమారు రూ.72,860 కోట్లు) చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 665 కోట్ల డాలర్లు ఎక్కువ. అయితే గత ఆర్థిక సంవత్సరం మన దేశానికి రికార్డు స్థాయిలో మొత్తం 9,453 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్టు ఆర్‌బీఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే కాలంలో మన దేశం నుంచి బయటికి పోయిన పెట్టుబడులను తీసివేస్తే, నికరంగా మిగిలిన ఎఫ్‌డీఐ 765 కోట్ల డాలర్లు మాత్రమే.
Also Read:
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు