ఎగుమతుల జోరు
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:07 AM
మన దేశ వస్తు ఎగుమతులు జూలైలో జోరుగా పెరిగాయి. 19.63 శాతం వృద్ధితో 4,424 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.22 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత ఇదే అత్యధిక వృద్ధి....
6 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
జూలైలో రూ.4.22 లక్షల కోట్లు.. 19.6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మన దేశ వస్తు ఎగుమతులు జూలైలో జోరుగా పెరిగాయి. 19.63 శాతం వృద్ధితో 4,424 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.22 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత ఇదే అత్యధిక వృద్ధి. అధిక దిగుమతుల కారణంగా జూలైలో వాణిజ్య లోటు ఆరు నెలల గరిష్ఠ స్థాయి 3,198 కోట్ల డాలర్ల (రూ.3.05 లక్షల కోట్లు)కు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన దిగుమతులు జూలైలో దాదాపు 17.52 శాతం పెరిగి 7,622 కోట్ల డాలర్ల (సుమారు రూ.7.27 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ముడిచమురు దిగుమతుల్లో పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. క్రూడాయిల్ దిగుమతులు 17.64ు పెరిగి 1,831 కోట్ల డాలర్లకు చేరినట్టు గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. మొత్తం దిగుమతుల్లో ముడిచమురు దిగుమతుల వాటాయే దాదాపు 24 శాతంగా ఉంది.
పశ్చిమాసియాకు పెరిగిన ఎగుమతులు
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ జూలైలో పశ్చిమాసియా దేశాలకు భారత్ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.62 శాతం పెరిగి 570 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఏడాది ఇదే నెలలో ఈ దేశాలకు ఎగుమతులు 520 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ ప్రాంతానికి మొదటిసారిగా మార్చిలో ఎగుమతులు తగ్గాయి. అయితే ఏప్రిల్, మే, జూన్‌లో మళ్లీ మెరుగుపడ్డాయి. ఈ ప్రాంతంతో వాణిజ్యం పూర్వ స్థాయిలకు చేరుకుందని అగర్వాల్ తెలిపారు. యూఏఈకి మన దేశ ఎగుమతులు 10.15 శాతం పెరిగి 330 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. సౌదీ అరేబియాకు మాత్రం వార్షిక ప్రాతిపదికన 2.73 శాతం తగ్గి 76.37 కోట్ల డాలర్లకు చేరాయి. జూలైలో ఈ రెండు దేశాల నుంచీ దిగుమతులు తగ్గాయి. అయితే ఒమన్ నుంచి మాత్రం దిగుమతులు రెండింతలకు పైగా పెరిగి 157 కోట్ల డాలర్లకు చేరాయి.
బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం
బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో జూలైలో ఈ రెండు విలువైన లోహాల దిగుమతులపై ప్రభావం కనిపించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జూలైలో బంగారం దిగుమతులు కేవలం 4.77 శాతం పెరిగి 416 కోట్ల డాలర్లకు చేరుకోగా.. వెండి దిగుమతులు ఏకంగా 66.1 శాతం తగ్గి 17.16 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. మే 13న కేంద్ర ప్రభుత్వం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
అమెరికాకు ఎగుమతుల్లో 12.85% వృద్ధి
జూలైలో అమెరికాకు భారత్ ఎగుమతులు 12.85 శాతం పెరిగి 902 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అలాగే చైనాకు ఎగుమతులు 64.57 శాతం వృద్ధితో 220 కోట్ల డాలర్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే నెలలో ఈ దేశాల నుంచి దిగుమతుల్లోనూ వృద్ధి ఉన్నట్టు తెలిపింది. చైనా నుంచి దిగుమతులు 34.42 శాతం పెరిగి 1,467 కోట్ల డాలర్లకు చేరగా.. అమెరికా నుంచి 18.11 శాతం పెరిగి 550 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..