Share News

పసిడి డిమాండ్‌కు సుంకాల పోటు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:36 AM

భారత పసిడి డిమాండ్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలో పసిడి డిమాండ్‌ 131.4 టన్నులకు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది....

పసిడి డిమాండ్‌కు సుంకాల పోటు

ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి గిరాకీ

  • 15% తగ్గిన నగల డిమాండ్‌

  • ప్రపంచ స్వర్ణ మండలి

ముంబై: భారత పసిడి డిమాండ్‌ జోరుకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలో పసిడి డిమాండ్‌ 131.4 టన్నులకు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. గత ఆరేళ్లలో పసిడి డిమాండ్‌ ఎన్నడూ ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోలేదు. గత ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చినా డిమాండ్‌ పరిమాణం 6 శాతం తగ్గింది. దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచడం, క్యూ2లో అమ్మకాలు పెద్దగా లేకపోవడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేసేందుకు అత్యవసరమైతే తప్ప బంగారం కొనవద్దన్న ప్రధాని మోదీ పిలుపు పసిడి డిమాండ్‌ తగ్గడానికి ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ తెలిపింది.

విలువపరంగా రికార్డ్‌

క్యూ2లో పరిమాణపరంగా పసిడి డిమాండ్‌ తగ్గినా.. విలువపరంగా చూస్తే మాత్రం సరికొత్త రికార్డు నమోదైం ది. ఈ కాలంలో భారత్‌లో రికార్డు స్థాయిలో రూ.1,98,100 కోట్ల విలువైన పసిడి అమ్ముడైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. ‘ధరలు అధికంగా ఉన్నా వినియోగదారులు పసిడి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు అనేందుకు ఇదే నిదర్శనం’ అని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈఓ సచిన్‌ జైన్‌ తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది భారత పసిడి డిమాండ్‌ 650 నుంచి 750 టన్నుల వరకు ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా. ‘ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది మధ్యస్థంగా 700 టన్నుల వరకు ఉండవచ్చు. ఒకవేళ ధరలు దిద్దుబాటుకు లోనై.. ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మాత్రం డిమాండ్‌ 750 టన్నులకు సునాయాసంగా చేరుతుంది’ అని సచిన్‌ జైన్‌ చెప్పారు.

పెరిగిన స్మగ్లింగ్‌

పసిడిపై దిగుమతి సుంకాలు పెంచడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక్కో ట్రిప్పుకు దాదాపు 18 శాతం లాభం ఉండడంతో ఏదోలా..అధికారుల కళ్లు గప్పి దుబాయ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తరలిస్తున్నట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ ఏడాది మే 13 నుంచి జూన్‌ నెలాఖరు వరకు స్మగ్లర్ల నుంచి 160.91 కేజీల బంగారం స్వాధీనం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ. గత ఏడాది ఇదే కాలంలో స్వాధీనం చేసుకున్న 86.16 కిలోలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ‘పసిడి మార్కెట్‌కు స్మగ్లింగ్‌ పెద్ద దెబ్బ. పెరుగుతున్న ఈ స్మగ్లింగ్‌పై మాకు ఇప్పటికే వార్తలు అందుతున్నాయి. వచ్చే త్రైమాసికాల్లో మేము దీనిపై మరింతగా దృష్టి పెడతాం’ అని సచిన్‌ జైన్‌ తెలిపారు.


6-Business.jpg

పెట్టుబడుల్లో పెరుగుదల

నగల కోసం బంగారం కొనడం తగ్గినా.. పెట్టుబడి లాభాల కోసం పసిడి కొనడం మాత్రం పెద్దగా తగ్గలేదు. జూన్‌ త్రైమాసికంలోనూ ఇందుకోసం 50.3 టన్నుల బంగారం కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. ఇదే సమయంలో మన దేశంలోని గోల్డ్‌ ఈటీఎఫ్‌లూ 4.2 టన్నుల నికర పసిడి పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది రెండో అర్థ భాగంలో పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో డిమాండ్‌ మరింత పెరుగుతుందని భావిస్తున్నట్లు సచిన్‌ జైన్‌ చెప్పారు.

తగ్గిన దిగుమతులు

ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో జూన్‌ త్రైమాసికంలో పసిడి దిగుమతులకూ బ్రేక్‌ పడింది. ఈ త్రైమాసికంలో పసిడి దిగుమతులు 98.1 టన్నులు మించలేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం తక్కువ. ఇదే సమయంలో దిగుమతి చేసుకునే ఔన్స్‌ పసిడి సగటు ధర మాత్రం 3,280.4 డాలర్ల నుంచి 4,506.3 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో భారత్‌లోనూ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.94,875.90 నుంచి రూ.1,50,744.8కి చేరిందని డబ్ల్యూజీసీ తెలిపింది.

జువెలరీ డిమాండ్‌కూ బ్రేక్‌

జూన్‌ త్రైమాసికంలో మన దేశంలో నగల (జువెలరీ) డిమాండ్‌కూ బ్రేక్‌ పడింది. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో నగల కోసం 88.8 టన్నుల పసిడి ఉపయోగించారు. జూన్‌ త్రైమాసికంలో అది 15 శాతం పడిపోయి 75.1 టన్నులకు పడిపోయింది. నిరాశాజనకమైన సీజన్‌, ప్రధాని పిలుపు, దిగుమతి సుంకాల పెంపు ఇందుకు ప్రధాన కారణం.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 03:36 AM