Share News

జీడీపీ వృద్ధి రేటు అదుర్స్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:14 AM

కష్ట కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4) లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసినట్టు...

జీడీపీ వృద్ధి రేటు అదుర్స్‌

మార్చి త్రైమాసికంలో 7.8%

2025-26 ఆర్థిక సంవత్సరానికి 7.7 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: కష్ట కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4) లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువ. గత ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తానికి చూసినా భారత జీడీపీ 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం (2024-25)తో పోలిస్తే ఇది 0.7 శాతం ఎక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధంతో చమురు, ఎల్‌పీజీతో పాటు ప్రధాన కమోడిటీల ధరలు చుక్కలంటిన తరుణంలోనూ భారత జీడీపీ క్యూ4లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం విశేషమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.

ప్రస్తుత ధరల ప్రకారం రూ.346.36 లక్షల కోట్లు: ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ విలువ రూ.346.36 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 8.9 శాతం (రూ.28.29 లక్షల కోట్లు) ఎక్కువ. జీడీపీ విలువ లెక్కింపునకు ప్రామాణికంగా తీసుకున్న 2022-23 ఆర్థిక సంవత్సరం నాటి ధరల ప్రకారం చూస్తే 2026 మార్చి నాటికి భారత జీడీపీ రూ.323.12 లక్షల కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.23.23 లక్షల కోట్లు ఎక్కువ. మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.87.77 లక్షల కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.81.40 లక్షల కోట్లుగా ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..

Updated Date - Jun 06 , 2026 | 03:14 AM