Share News

2026-27లో వృద్ధి రేటు 6.8-7.2 శాతం

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:44 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో జీడీపీ వృద్ధి రేటు 6.8-7.2 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనాతో పోలిస్తే...

2026-27లో వృద్ధి రేటు 6.8-7.2 శాతం

ఆర్థిక సర్వే నివేదిక అంచనా

  • అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి పెంపుపై దృష్టి పెట్టాలి..

  • ధరల సూచీ మళ్లీ కాస్త పెరగవచ్చు..

  • ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా అంతర్జాతీయ ప్రతికూలతలతో ఇబ్బందులు

  • విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వల్లే రూపాయి భారీగా క్షీణించింది..

  • రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించట్లేదు..

  • బలమైన, స్థిరమైన కరెన్సీతోనే వికసిత భారత్‌ లక్ష్యాలను సాధించగలం

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో జీడీపీ వృద్ధి రేటు 6.8-7.2 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ఆర్థిక సర్వే నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి అంచనాతో పోలిస్తే కాస్త తగ్గనున్నప్పటికీ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగనుందని రిపోర్టు పేర్కొంది. గడిచిన కొన్నేళ్ల్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు వార్షిక వృద్ధి సామర్థ్యాన్ని 6.5-6.8 శాతం శ్రేణి నుంచి 7 శాతానికి పెంచాయంది. ‘‘అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ స్థిర వృద్ధికి అవకాశం ఉంది. దీనికి జాగ్రత్త అవసరం. కానీ నిరాశావాదం కాదు’’ అని రిపోర్టు అభిప్రాయపడింది. ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్‌ పర్యవేక్షణలో రూపొందించిన ఈ ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌కు సమర్పించారు. ఇందులోని మరిన్ని ముఖ్యాంశాలు..


  • అంతర్జాతీయ అనిశ్చితి వాతావరణంలో దేశీయ వృద్ధిపై దృష్టి సారించాలి. ఇందుకు నిల్వల పెంపు, ద్రవ్య లభ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నమోదైన ఆర్థిక వ్యవస్థ పనితీరు మన ఆర్థిక స్థిరత్వంతోపాటు అంతర్జాతీయ ఒడుదుడుకుల్లోనూ నిలకడగా వృద్ధి సాధనను ప్రదర్శిస్తోంది.

  • కీలక ఉత్పత్తుల ధరలకు కళ్లెం పడటంతో ద్రవ్యోల్బణం (ధరల వార్షిక పెరుగుదల రేటు) అదుపులోకి వచ్చింది. వ్యవస్థలో వస్తు సరఫరా మెరుగైందనడానికిది సంకేతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026-27లో ద్రవ్యోల్బణం మళ్లీ కాస్త పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

  • ఆర్థిక వ్యవస్థలో వైరుధ్య పరిస్థితి నెలకొంది. మన ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. దాంతో మన కరెన్సీ తీవ్ర ఒత్తిడినెదుర్కొంటోంది.

  • రూపాయి పనితీరు గత ఏడాది పేలవంగా ఉంది. రూపాయి ప్రస్తుత విలువ మన పటిష్ఠ ఆర్థిక మూలాలను ప్రతిబింబజేయట్లేదు. అయితే, రూపాయి క్షీణత అమెరికా అధిక సుంకాల ప్రభావాన్ని కొంత మేర తగ్గించగలుగుతోంది.

  • బలమైన, స్థిరమైన కరెన్సీతోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలగడంతోపాటు వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించగలం.

  • యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎ్‌ఫటీఏ) మన తయారీ పోటీతత్వం, ఎగుమతి వాణిజ్యం, వ్యూహాత్మ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాన్ని పూర్థి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు మిగతా దేశాల కంటే చౌకగా తయారు చేయాల్సిన అవసరం ఉంది.

  • జీఎ్‌సటీ రేట్ల హేతుబద్ధీకరణతో పాటు ఇతర సంస్కరణలు అంతర్జాతీయ అనిశ్చితులను అవకాశాలుగా మలిచాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ మార్పులను సర్దుబాటు చేసుకోనుంది.

  • భౌగోళిక రాజకీయ మార్పులతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా మారాయి. పెట్టుబడులు, సరఫరా వ్యవస్థ, వృద్ధి అవకాశాలపై అవి ప్రభావం చూపుతున్నాయి.

  • భవిష్యత్‌లో సంభవించే అంతర్జాతీయ సంక్షోభాలు భారత్‌కు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశాన్ని పంచనున్నాయి.

  • ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో లోటు బడ్జెట్‌ అంచనాల కంటే తగ్గి 4.8 శాతానికి పరిమితమైంది.

  • భారత విమానయాన రంగం సుస్థిర వృద్ధి పథంలో సాగుతోంది. ప్రభుత్వ సానుకూల విధానాలు, మౌలిక వసతుల విస్తరణ ఇందుకు తోడ్పడుతున్నాయి. భారత్‌ మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగింది. 2014లో దేశంలో 74 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. 2025 నాటికి వాటి సంఖ్య 164కు పెరిగింది.

  • కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌ ఆశించిన ఉత్పాదక ప్రయోజనాలను అందించడంలో విఫలమైనట్లైతే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి రావచ్చు. దాంతో ఈక్విటీలు సహా ఆశావహ అసెట్‌ క్లాస్‌ల విలువలు భారీగా క్షీణించే ప్రమాదం ఉంది.


  • పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పనకు కీలకమైన ఉక్కు రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహం ధరలో వ్యత్యాసం, ముడి సరుకు లభ్యత ఇందుకు కారణమవుతున్నాయి.

  • భారత్‌లో తయారైన కార్లకు ప్రపంచ మార్కెట్లో ఆమోదం పెరుగుతున్నదనడానికి గడిచిన కొన్నేళ్లలో దేశీయ వాహన కంపెనీల ఎగుమతులు భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంలో మన ఆటోమొబైల్‌ కంపెనీలు 53 లక్షల యూనిట్ల వాహనాలను (అన్ని రకాలు కలిపి) ఎగుమతి చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది.

బంగారం, వెండి ఆకాశంలోనే..

అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్ఠాల వద్దే కొనసాగవచ్చని సర్వే నివేదిక పేర్కొంది. భౌగోళిక, వాణిజ్య యుద్ధాలకు తెరపడి, శాంతి నెలకొంటే తప్ప ధరలు దిగివచ్చే అవకాశాలు కన్పించడం లేదని అంటోంది.

0000-Business.jpg

భవిష్యత్‌లో రాగి కొరత!

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవల కోసం డేటా సెంటర్లు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిందని, దాంతో రాగి కొరత ఏర్పడవచ్చని సర్వే అంచనా వేసింది. ప్రపంచంలో ఇంధన పరివర్తనం ఇకపై సాంకేతికత ద్వారానే నిర్ణయింపబడదని, కీలక ఖనిజాలను ఎవరు నియంత్రిస్తున్నారనే దానిపై అధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. లిథియం, కోబాల్ట్‌, నికెల్‌, కాపర్‌తో పాటు అరుదైన ఖనిజాలు వ్యూహాత్మక అవరోధాలుగా మారాయంది.


స్వదేశీ

అనివార్యం

ఎగుమతులపై నియంత్రణ పెరగడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక నిరాకరణ, కర్బన పన్నుల విధానాలతో ప్రపంచీకరణ ప్రక్రియకు తెరపడినట్లేనని.. ఈ నేపథ్యంలో భారత్‌ స్వదేశీపై దృష్టిపెట్టడం అనివార్యం, తప్పనిసరని ఆర్థిక సర్వే నివేదిక అభిప్రాయపడింది. దిగుమతుల ప్రత్యామ్నాయాలు, వ్యూహాత్మక స్థితిస్థాపకత, ఆవశ్యకతపై స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక విధానాలను ఏకకాలంలో చేపట్టాల్సి ఉందని సూచించింది. ఎందుకంటే, ప్రస్తుతం మన దేశం సాంకేతికత, మార్కెట్లు, ముడిసరుకులు సునాయసంగా, శాశ్వతంగా అందుబాటులో ఉంటాయన్న నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నామని.. ఈ పరిస్థితుల్లో స్వదేశీ మంత్రమే మనకు రక్షణాత్మక, పోరాట సాధనమని పేర్కొంది. దక్షత, ఆవిష్కరణ, ప్రపంచ ఏకీకరణకు భంగం కలగకుండా స్వదేశీ విధానాలను అనుసరించాలంది. స్వదేశీ సాధారణ సిద్ధాంతంలా కాకుండా క్రమశిక్షణతో కూడిన వ్యూహమై ఉండాలని సర్వే నివేదిక సూచించింది. దిగుమతులను వీలైనంతగా తగ్గించుకుని, అవకాశమున్న ప్రతి వస్తువును దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ క్రమశిక్షణ, విదేశీ ధోరణి, విశ్వసనీయ నిష్క్రమణతో కూడిన తెలివైన స్వదేశీకరణను అనుసరించాలని సర్వే నివేదిక సూచించింది.

భారత్‌ తయారీ, ఎగుమతుల పెంపు, సంస్కరణలకు ప్రాధాన్యమిస్తే మరికొన్నేళ్లలో వార్షిక వృద్ధి రేటు సామర్థ్యం 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యకాలిక వృద్ధికి అనుకూలంగా గడిచిన మూడేళ్లలో పలు అంశాల్లో సంస్కరణల జోరును పెంచింది. తయారీకి ప్రోత్సాహక పథకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనల సడలింపు, రవాణా వ్యవస్థ సంస్కరణలు సామర్థ్యాన్ని సృష్టించేందుకు తోడ్పడ్డాయి.

వీ అనంత

నాగేశ్వరన్‌, సీఈఏ

ఇవి కూడా చదవండి..

అజిత్‌ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..

భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు

Updated Date - Jan 30 , 2026 | 06:46 AM