భారత్‌పై 100 శాతం సుంకాల కత్తి!
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:18 AM
భారత్‌పై అమెరికా సుంకాల కత్తి వేలాడుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌తోపాటు పలు దేశాల వస్తువుల దిగుమతులపై 100 శాతం వరకు సుంకాల భారం...
రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై టారిఫ్ విధించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్
న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా సుంకాల కత్తి వేలాడుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌తోపాటు పలు దేశాల వస్తువుల దిగుమతులపై 100 శాతం వరకు సుంకాల భారం మోపేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 100 శాతం వరకు సుంకాల భారం మోపే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. అదే జరిగితే భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అటకెక్కినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే?: రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 30.3 శాతం ముడిచమురు రష్యా నుంచే దిగుమతైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఈ దిగుమతులు మరింత పెరిగాయి. ఈ ఏడాది జూలై నాటికి మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 51 శాతానికి చేరింది. ఈ దిగుమతుల కోసం భారత్ చెల్లిస్తున్న డబ్బులతో రష్యా, ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా భావిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే రష్యా నుంచి చమురు, ఇతర ఇంధనాలు దిగుమతి చేసుకునే అన్ని దేశాలపై ఆంక్షల కొరడా ఝుళిపించాలని కొంత మంది అమెరికా సెనేటర్లు నిర్ణయించారు. అందులో భాగంగానే అక్కడి ప్రతినిధుల సభలో ఈ బిల్లు ప్రవేశ పెట్టారు.
బెదిరింపు చర్య: నిజానికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) దాదాపుగా ఖరారైంది. కాకపోతే మన వస్తువులపై సుంకాల భారం ఇంకా కొద్దిగా తగ్గించాలని భారత్ కోరుతోంది. దీంతో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా రష్యా చమురు దిగుమతుల పేరుతో నాటకాలు ఆడుతోందని ప్రముఖ మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) అనే సంస్థ హెచ్చరించింది. భారత్ కంటే రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాను వదిలిపెట్టి, భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకులు శ్రీవాస్తవ అన్నారు.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు