Share News

భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్లు

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:13 AM

ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల 40వ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది జాబితాలో భారత్‌ నుంచి 229 మందికి చోటు దక్కింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి...

భారత బిలియనీర్ల మొత్తం సంపద లక్ష కోట్ల డాలర్లు

  • ఆసియా సంపన్నుడు అంబానీ 1, అదానీ నం.2

  • దేశంలో 229 మంది బిలియనీర్లు.. 15 మంది తెలుగువారు

  • కుబేరుల సంఖ్యలో ఇండియా నంబర్‌ 3.. ఫోర్బ్స్‌ జాబితా

న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల 40వ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది జాబితాలో భారత్‌ నుంచి 229 మందికి చోటు దక్కింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 9,970 కోట్ల డాలర్ల సంపదతో భారత్‌తో పాటు ఆసియాలోకెల్లా అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. 6,380 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ దేశంలో రెండో అతిపెద్ద ధనికుడుగా నిలిచారు. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సావిత్రి జిందాల్‌ 3,910 కోట్ల డాలర్ల ఆస్తితో మూడో స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కిన 20 మంది భారత మహిళల్లో ఈమెదే అగ్రస్థానం. కాగా, స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ (3,100 కోట్ల డాలర్లు), హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ (3,090 కోట్ల డాలర్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా (2,700 కోట్ల డాలర్లు), సన్‌ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ (2,560 కోట్ల డాలర్లు), ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా (2,110 కోట్ల డాలర్లు), డీమార్ట్‌ సూపర్‌మార్కెట్ల వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ (1,570 కోట్ల డాలర్లు), కోటక్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ ఉదయ్‌ కోటక్‌ (1,440 కోట్ల డాలర్లు) వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో నిలిచారు.


  • దేశంలోని బిలియనీర్ల సంఖ్య గత ఏడాదిలో నమోదైన 205 నుంచి ఈసారి 229కి పెరిగింది. ఈసారి కొత్తగా 30 మందికి చోటు దక్కింది. భారత బిలియనీర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి 15 మందికి చోటు లభించింది. వారిలో ఎక్కువ మంది ఫార్మా రంగం వారే.

  • మన బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాది లక్ష కోట్ల డాలర్లకు (రూ.92 లక్షల కోట్లు) చేరుకుంది. గత ఏడాదిలో సంపద విలువ 94,100 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ సారి టాప్‌ టెన్‌ కుబేరుల సంపద 36,800 కోట్ల డాలర్లు. అంటే, లక్ష కోట్ల డాలర్లలో మూడో వంతు వాటా వీరిదే.

  • ప్రపంచంలో అత్యధిక మంది కుబేరులున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 989 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. చైనా (హాంకాంగ్‌తో కలిపి) 610 మంది సంపన్నులతో రెండో స్థానంలో ఉంది.

ప్రపంచ నం.1 మస్క్‌

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 83,900 కోట్ల డాలర్ల ఆస్తితో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచారు. గూగుల్‌ వ్యవస్థాపకులు లారీ పేజ్‌ (25,700 కోట్ల డాలర్లు), సెర్గే బ్రిన్‌ (23,700 కోట్ల డాలర్లు) నెట్‌వర్త్‌తో వరుసగా 2,3 స్థానాలను దక్కించుకున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (22,400 కోట్ల డాలర్లు), ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (22,200 కోట్ల డాలర్లు) వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 3,428 మందికి ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. గత ఏడాదితో పోలిస్తే సంఖ్య 400 పెరిగింది. ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 20.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. గత ఏడాదిలో నమోదైన 16.1 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే మరో 4 లక్షల కోట్ల డాలర్ల వృద్ధి నమోదైంది. ప్రపంచంలో 20 మంది కనీసం 10,000 కోట్ల డాలర్ల ఆస్తి కలిగి ఉన్నారు. వీరి మొత్తం సంపద 3.8 లక్షల కోట్ల డాలర్లు. లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపదలో దాదాపు 20 శాతానికి సమానం. ఈ నెల 1 నాటికి స్టాక్‌ మార్కెట్లో కంపెనీల షేర్ల ధరలు, కరెన్సీ మారకం రేట్ల ఆధారంగా ప్రపంచ సంపన్నుల ఆస్తిని లెక్కించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.


ట్రంప్‌ సంపద 27% వృద్ధి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్తి గడిచిన ఏడాది కాలంలో 27 శాతం పెరిగి 650 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆయన కుటుంబ కంపెనీల క్రిప్టో కరెన్సీ డీలింగ్స్‌ ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. ప్రపంచ రిచ్‌ లిస్ట్‌లో ట్రంప్‌ 645వ స్థానంలో ఉన్నారు.

తెలుగు కుబేరులు వీరే...

ప్రపంచ ర్యాంక్, పేరు, ఆస్తి(కోట్ల డాలర్లు), కంపెనీ

332 - మురళి దివి - 1,010 - దివీస్‌ లేబొరేటరీస్‌

1108 - జీఎం రావు - 390 - జీఎంఆర్‌ గ్రూప్‌

1189 - ప్రతాప్‌ సి రెడ్డి - 360 - అపోలో హాస్పిటల్స్‌

1251 - బీ పార్థసారధి రెడ్డి - 340 - హెటిరో గ్రూప్‌

1325 - మహిమ దాట్ల - 320 - బయోలాజికల్‌-ఇ

1406 - పీవీ రాంప్రసాద్‌ రెడ్డి - 300 - అరబిందో ఫార్మా

1440 - ఎం సత్యనారాయణ రెడ్డి - 290 - ఎంఎస్‌ఎన్‌ ఫార్మా

1834 - జూపల్లి రామేశ్వర్‌ రావు - 230 - మై హోమ్‌ గ్రూప్‌

1982 - పీవీ కృష్ణా రెడ్డి - 210 - మేఘా ఇంజనీరింగ్‌

2052 - పీ పిచ్చి రెడ్డి - 200 - మేఘా ఇంజనీరింగ్‌

2481 - కే సతీశ్‌ రెడ్డి - 160 - డాక్టర్‌ రెడ్డీస్‌

2481 - జీవీ ప్రసాద్‌ - 160 - డాక్టర్‌ రెడ్డీస్‌

2600 - సత్యనారాయణ చావా - 150 - లారస్‌ ల్యాబ్స్‌

3017 - ఆలూరు జగదీశ్‌ ప్రసాద్‌ - 120 - హెచ్‌బీఎల్‌ పవర్‌

3185 - సుబ్బమ్మ జాస్తి - 110 - సువెన్‌ ఫార్మా


ఇవి కూడా చదవండి..

Updated Date - Mar 12 , 2026 | 08:31 AM