Share News

రిటైల్‌ జీసీసీల ప్రపంచ హబ్‌గా భారత్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:48 AM

మన దేశం ప్రపంచంలోని అనేక రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కేంద్రంగా మారుతోంది. గత ఏడాది చివరి నాటికి దేశంలో వీటి సంఖ్య...

రిటైల్‌ జీసీసీల ప్రపంచ హబ్‌గా భారత్‌

దేశవ్యాప్తంగా 180 సెంటర్లు.. 2.72 లక్షలకు చేరిన ఉద్యోగుల సంఖ్య

న్యూఢిల్లీ: మన దేశం ప్రపంచంలోని అనేక రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కేంద్రంగా మారుతోంది. గత ఏడాది చివరి నాటికి దేశంలో వీటి సంఖ్య 180కి చేరింది. ఇది పోలెండ్‌, ఫిలిప్పీన్స్‌, మెక్సికో, జర్మనీ, ఈజిప్టు దేశాల్లో ఉన్న మొత్తం రిటైల్‌ జీసీసీల కంటే 34 శాతం ఎక్కువని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ అనే సంస్థ తెలిపింది. వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ టెక్‌, టార్గెట్‌, లోరియల్‌, ఏబీ ఇన్‌బెవ్‌, టెస్కో వంటి అంతర్జాతీయ దిగ్గజ రిటైల్‌ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో తమ జీసీసీలు ఏర్పాటు చేశాయి.

ఉద్యోగుల సంఖ్య రెట్టింపు

మన దేశంలోని రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య గత ఏడాది చివరికి 2,72,300 కు చేరింది. వీరిలో 52,000 మంది గత ఏడాది ఉద్యోగాల్లో కొత్తగా చేరారు. 2024తో పోలిస్తే జీసీసీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్య రెట్టింపైంది.

అన్ని దేశాల నుంచి

అమెరికా రిటైల్‌ కంపెనీలతో పాటు అనేక యూరోపియన్‌ రిటైల్‌ కంపెనీలూ మన దేశంలో పెద్దఎత్తున తమ జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల జపాన్‌, దక్షిణ కొరియా రిటైల్‌ కంపెనీలూ మన దేశంలో తమ జీసీసీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈఓ నీతి శర్మ చెప్పారు. పెద్దఎత్తున నిపుణులైన ఉద్యోగులు లభించడం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సానుకూల వ్యాపార విధానాలు, పన్ను రాయితీలు, తక్కువగా ఉన్న మౌలిక సదుపాయాల ఖర్చులు ఇందుకు ప్రధాన కారణమని శర్మ తెలిపారు.

130 నానో జీసీసీలే

విదేశీ రిటైల్‌ కంపెనీలు మన దేశంలో ఒక్కసారిగా పెద్ద జీసీసీలు ఏర్పాటు చేయడం లేదు. ముందు 200 నుంచి 250 మంది పనిచేసేలా నానో జీసీసీలను ఏర్పాటు చేసి, తర్వాత అవసరాన్ని బట్టి విస్తరించుకుంటూ పోతున్నాయి. ప్రస్తుతం మన దేశం లో ఉన్న 180 రిటైల్‌ జీసీసీల్లో 130 నానో జీసీసీలని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ తెలిపింది. ఈ జీసీసీల్లో ఎక్కువ భాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, హైదరాబాద్‌తో పాటు మంగుళూరు వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటవుతున్నాయి.


ఏఐ నిపుణులకు డిమాండ్‌

మన దేశంలోని జీసీసీల్లో పనిచేసేందుకు అవసరమైన ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులు పెద్దగా దొరకటం లేదు. ప్రస్తుతం ఉన్న 180 రిటైల్‌ జీసీసీల్లో పని చేస్తున్న ఏఐ నిపుణుల్లో కేవలం 320 మందికి మాత్రమే ఏఐ టూల్స్‌పై ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఉంది. అంటే ఒక్కో రిటైల్‌ జీసీసీల్లో సగటున ఇద్దరి కంటే ఎక్కువ మంది సీనియర్‌ ఏఐ నిపుణులు లేరు. జీసీసీల్లో పని చేసేందుకు అవసరమైన ఏఐ నిపుణుల్లో 54 మంది బెంగళూరులో పని చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌, పుణెల్లోనూ వీరి సంఖ్య పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:48 AM