Share News

ఆకర్ష.. ఆకర్ష! విదేశీ పెట్టుబడులకు గాలం

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:18 AM

ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, ఇతర కమోడిటీ ధరలు భారీ గా పెరిగాయి. దాంతో...

ఆకర్ష.. ఆకర్ష! విదేశీ పెట్టుబడులకు గాలం

పలు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌

  • ప్రభుత్వ రుణ పత్రాల్లో విదేశీ పెట్టుబడులపై క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను ఎత్తివేసిన కేంద్రం

  • రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఫారెక్స్‌ నిల్వలను పెంచుకునేందుకు దోహదం

ముంబై/న్యూఢిల్లీ: ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, ఇతర కమోడిటీ ధరలు భారీ గా పెరిగాయి. దాంతో దిగుమతుల వ్యయం తడిసి మోపెడవుతోంది. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే దిగుమతుల కోసం చెల్లింపుల కారణంగా మన విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) పెద్దఎత్తున తరలిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.2.25 లక్షల కోట్లకు పైగా తరలించేశారు. ఈ రెండు పరిణామాలు మన రూపాయి భారీ పతనానికి, విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వల తరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఫారెక్స్‌ నిల్వలను పెంచుకునేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఒకే రోజు కీలక చర్యలను ప్రకటించాయి.

ఆర్‌బీఐ, ప్రభుత్వం చేపట్టిన చర్యలు..

  • విదేశీ ఇన్వెస్టర్లకు మన ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ-సెక్‌) పెట్టుబడుల పరిధిని విస్తృతం చేసింది. ఫుల్లీ యాక్సెసబుల్‌ రూట్‌ (ఎ్‌ఫఏఆర్‌)లో భాగంగా కొత్తగా జారీ చేసే 15 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల కాలపరిమితితో కూడిన జీ-సెక్‌లలోనూ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి.

  • స్వల్పకాలిక పెట్టుబడులపై పరిమితి, కాన్సట్రేషన్‌ లిమిట్స్‌తో పాటు జనరల్‌ రూట్‌లో భాగంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎ్‌ఫపీఐ) వ్యక్తిగతంగా కలిగి ఉండగలిగే సెక్యూరిటీలపైనా పరిమితి ఎత్తివేత.

  • లిస్టెడ్‌ ఈక్విటీ సాధనాల్లో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) పరిధిలోకి వచ్చేవారు నియంత్రణ మండలి రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా పెట్టగలిగే పెట్టుబడుల పరిమితి పెంపు. అంతేకాదు, పెట్టుబడుల పరిధి.. ఇండివిడ్యువల్‌ పర్సన్స్‌ రెసిడెంట్‌ అవుట్‌సైడ్‌ ఇండియా (పీఆర్‌ఓఐ)కూ విస్తరింపు.

  • ప్రభుత్వ సంస్థల విదేశ రుణాల సమీకరణలో ఈ సెప్టెంబరు 30 వరకు విదేశీ మారకం మార్పిడిపై రాయితీ.

  • మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెన్సీ బ్యాంక్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ) డిపాజిట్ల సమీకరించడంలో డీలర్‌ బ్యాంకుల పూర్తి హెడ్జింగ్‌ ఖర్చులను భరించనున్న ఆర్‌బీఐ. ఈ సదుపాయం 2026 సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటుంది.

  • ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) లో భాగంగా విదేశాలకు వస్తు,సేవలు, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులపై సొమ్ము వసూలుకు గడువును గతంలో కల్పించిన 15 నెలల సమయం నుంచి మళ్లీ 9 నెలలకు కుదించాలని ప్రతిపాదన.


విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను ఊరట

భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులపై ఆర్జించే వడ్డీపై ఆదాయ పన్నుతో పాటు మూలధన లాభాల పన్ను (క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చేలా విదేశీ ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్ల అమ్మకం, బదిలీ, మార్పిడి ద్వారా ఆర్జించిన వడ్డీ ఆదాయం లేదా మూలధన లాభాలపై పన్నును మినహాయిస్తూ ఆదా య పన్ను చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలకు ముందు విదేశీ ఇన్వెస్టర్లు ఏడాదికి మించి కలిగి ఉన్న లిస్టెడ్‌ షేర్లు, బాండ్ల విక్రయంపై ఆర్జించిన లాభాలపై 12.5 శాతం క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి వచ్చేది. అలాగే, ప్రభుత్వ బాండ్లపై ఆర్జించిన వడ్డీ ఆదాయంపై 20 శాతం విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి వచ్చేది.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 03:18 AM