ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంలో పారదర్శకత లేదు..
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:23 AM
ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటాల అమ్మకంలో పెద్ద గూడుపుఠానీ జరుగుతోందని అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సంఘం (ఏఐబీఓఏ) ఆరోపించింది....
ఏఐబీఓఐ ఆరోపణ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో ప్రభుత్వ, ఎల్‌ఐసీ వాటాల అమ్మకంలో పెద్ద గూడుపుఠానీ జరుగుతోందని అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సంఘం (ఏఐబీఓఏ) ఆరోపించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా కెనడా కేంద్రంగా పనిచేసే ప్రేమ్‌వత్స నాయకత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్ కంపెనీకి కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది. దీనిపై ఏఐబీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్.. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపమ్) కార్యదర్శికి ఒక లేఖ రాశారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దాలని కోరారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో రూ.110 కనీస ధరగా నిర్ణయించిన ఐడీబీఐ బ్యాంక్ షేర్ల ధరను ఇప్పుడు రూ.81కు కుదించడంలో మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు.
స్థిరాస్తులే రూ.30,000 కోట్లు: బ్యాంకు స్థిరాస్తులే రూ.30,000 కోట్ల వరకు ఉంటే, బ్యాంకు ఈక్విటీలో ప్రభుత్వం, ఎల్‌ఐసీలకు ఉన్న వాటాల్లో 60.72 శాతాన్ని ఒక్కో షేరును రూ.81 చొప్పున రూ.53,000 కోట్లకు అమ్మడం ఏమిటని నాగరాజన్ ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఐడీబీఐ బ్యాంక్ ఆస్తుల విలువ లెక్కగట్టారో బహిర్గతం చేయాలని కోరారు. ఈ విషయంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఐడీబీఐ బ్యాంక్ మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలకూ విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని భూమి విలువే రూ.13,450 కోట్లు
ఐడీబీఐ బ్యాంక్‌కు హైదరాబాద్‌లో ఉన్న 50 ఎకరాల భూమి విలువే రూ.13,450 కోట్ల వరకు ఉంటుందని నాగరాజన్ తన లేఖలో పేర్కొన్నారు. 2019 జనవరిలో ఎల్‌ఐసీ ఈ బ్యాంకు ఈక్విటీలో ఒక్కో షేరును రూ.61 చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చూసి నా ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్ వాటాలను ప్రభుత్వం ఒక్కోటి రూ.133 చొప్పున అమ్మితే తప్ప ఎల్‌ఐసీకి గిట్టుబాటు కాదన్నారు. శుక్రవారం బీఎ్‌సఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ.90.62 దగ్గర క్లోజైంది.
ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్.. ఐడీబీఐ బ్యాంక్ ఈక్విటీలో మెజారిటీ వాటాను దక్కించుకున్నా, బ్యాంక్ వ్యాపార విస్తరణ కంటే దాని స్థిరాస్తుల అమ్మకం పైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని నాగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్’ నోటీసులు
సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్