జీసీసీల హాట్‌స్పాట్‌గా హైదరాబాద్
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:19 AM
ఐటీ కంపెనీలకే కాదు, గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ)కూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇక్కడ ఏర్పాటైన జీసీసీల సంఖ్య దాదాపు 515కు చేరింది....
మార్చి నాటికి 515కు చేరిక
3 లక్షల మందికి పైగా ఉద్యోగులు
ఏడాదిలోగా మరో 50-70 జీసీసీలు ఫిక్కీ-అనరాక్ నివేదిక
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలకే కాదు, గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ)కూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇక్కడ ఏర్పాటైన జీసీసీల సంఖ్య దాదాపు 515కు చేరింది. దీంతో ఈ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లోని జీసీసీల్లో దాదాపు మూడు లక్షల మంది పని చేస్తున్నట్టు ఫిక్కీ-అనరాక్ సంస్థలు ఒక నివేదికలో వెల్లడించాయి. ఇవిగాక వచ్చే 12 నెలల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా మరో 50 నుంచి 70 జీసీసీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది.
హైదరాబాదే ఎందుకు?
నిర్వహణ ఖర్చులు, నిపుణులైన ఉద్యోగుల లభ్యత, చక్కటి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సానుకూల వ్యాపార విధానాల ఆధారంగా ఎంఎన్‌సీలు తమ జీసీసీలను ఏర్పాటు చేస్తాయి. ఈ నాలుగు అంశాలు హైదరాబాద్‌లో పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం దేశంలో ఏర్పాటైన జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే కొలువుదీరాయి. ఏఐ దెబ్బతో ఐటీ రంగంలో ఇటీవల ఉద్యోగ నియామకాలు తగ్గాయి. జీసీసీల్లో ఇంకా ఈ స్థితి రాలేదు. ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీలు 20 నుంచి 30 శాతం అధిక జీతాలు ఆఫర్ చేయడంతో నిపుణులైన చాలా మంది ఐటీ ఉద్యోగులు, తమ ఐటీ కంపెనీలకు గుడ్‌బై చెప్పి జీసీసీల్లో చేరిపోతున్నారు. దీంతో ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లోని ఐటీ, జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 11 లక్షలకు చేరుతుందని అంచనా.
రియల్టీకీ బూస్ట్
జీసీసీల వెల్లువతో హైదరాబాద్ స్థిరాస్తి (రియల్టీ) రంగానికీ మంచి గిరాకీ ఏర్పడింది. 2021 నాటికి 19 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకోగా, 2025 నాటికి ఇది 45 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి చేరింది. ఇక ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఈ సంస్థలు 30 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకిపైగా ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. దీంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆఫీస్ స్పేస్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్ లీజు రెంటల్స్ ఎస్‌ఎ్‌ఫటీకి రూ.95 నుంచి రూ.115 వరకు ఉన్నట్టు ఫిక్కీ-అనరాక్ నివేదిక పేర్కొంది. జీసీసీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరో 3.6 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్ స్పేస్ నిర్మించేందుకు బిల్డర్లు సిద్ధమవుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!