ఫార్మాలో ‘హెచ్‌ఆర్‌వీ ఫార్మా’ సంచలనం
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:27 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఇప్పుడు భారత ఫార్మా రంగంలో సరికొత్త సంచలనం. కంపెనీకి సొంతంగా ఒక్క ఉత్పత్తి యూనిట్ కూడా లేదు. ఉన్నదల్లా సొంత డ్రగ్ మాస్టర్ ఫైల్స్...
ఒక్క సొంత యూనిట్ లేకుండానే రూ.వందల కోట్ల టర్నోవర్
ముంబై: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఇప్పుడు భారత ఫార్మా రంగంలో సరికొత్త సంచలనం. కంపెనీకి సొంతంగా ఒక్క ఉత్పత్తి యూనిట్ కూడా లేదు. ఉన్నదల్లా సొంత డ్రగ్ మాస్టర్ ఫైల్స్ (డీఎంఎఫ్), అంతర్జాతీయ కస్టమర్లతో చక్కటి వ్యాపార సంబంధాలు మాత్రమే. ఈ సంబంధాలతో గత ఆర్థిక సంవత్సరం హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఏకంగా రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరికొద్ది సంవత్సరాల్లో దీన్ని రూ.1,000 కోట్లకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఐదేళ్లుగా కంపెనీ ఆదాయ వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుంటే కంపెనీకి ఇదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఇదీ బిజినెస్ మోడల్: మన దేశంలో తుది ఔషధాల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ) తయారు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇందులో 650కు పైగా కంపెనీలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ మండలి (యూఎ్‌సఎ్‌ఫడీఏ) లేదా యూరోపియన్ యూనియన్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) నాణ్యతా ప్రమాణాల గుర్తింపు ఉంది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్ధ్యంలో ప్రస్తుతం 50 నుంచి 55 శాతానికి మించి ఉపయోగించుకోవడం లేదు. ఇక్కడే హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఎండీ,సీఈఓ హరి కిరణ్ చెరెడ్డి చక్కటి వ్యాపార అవకాశాన్ని చూశారు.
ఇందులో 53 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని.. ఆ కంపెనీల్లో తన అంతర్జాతీయ క్లయింట్లకు అవసరమైన ఏపీఐలు తయారు చేయించి సరఫరా చేస్తున్నారు. దీంతో కంపెనీలకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం లభించటంతో పాటు హెచ్‌ఆర్‌వీ ఫార్మాకు సొంతంగా ఒక్క ఏపీఐ తయారీ యూనిట్ లేకుండా రూ.వందల కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఏర్పడింది. క్యాబ్స్ రంగంలో ఉబర్, ఓలా, ఫుడ్ బిజినె్‌సలో స్విగ్గీ, జొమాటో తరహాలో ఫార్మా రంగంలో సరికొత్త బిజినె్‌సకు హెచ్‌ఆర్‌వీ ఫార్మా శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..