Share News

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ భారమా.. భరోసానా?

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:49 AM

ప్రస్తుతం ఎవరి జీవితానికి భరోసా లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో తెలియదు. అందుకే గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)లు హోమ్‌ లోన్‌ కూడా....

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ భారమా.. భరోసానా?

ప్రస్తుతం ఎవరి జీవితానికి భరోసా లేదు. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో తెలియదు. అందుకే గృహ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)లు హోమ్‌ లోన్‌ కూడా తీసుకోండని చెబుతుంటాయి. అయితే హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ అందరికీ అవసరమా అంటే? కాదనే చెప్పాలి. మరి ఎవరికి అవసరం? ఎవరికి అవసరం లేదో తెలుసుకుందాం.

గృహ రుణాలు తీసుకునే సమయంలో చాలా మంది వడ్డీ రేటు, నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ, రుణ చెల్లింపు గడువుల గురించే ఆలోచిస్తారు. పేపర్‌ వర్క్‌ పూర్తి చేసేటప్పుడు బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ అంశాన్ని లేవనెత్తుతాయి. చాలా బ్యాంకులు ఈ హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తమ గృహ రుణ ప్యాకేజీలో అంతర్భాగంగా ఆఫర్‌ చేస్తాయి. దాంతో గృహ రుణాలు తీసుకునే వారిలో చాలా మంది ఈ ఇన్సూరెన్స్‌ పాలసీ నిజంగా అవసరమా? లేక బ్యాంకులు పనిగట్టుకుని అంటగడుతున్నాయా? అని అనుమానిస్తారు.

గృహ రుణ బీమా అంటే?

గృహ రుణ చెల్లింపుల కాలం ముగిసే వరకు రుణం తీసుకున్న వ్యక్తి జీవించి ఉండాలి. మధ్యలో రుణం తీసుకున్న వ్యక్తికి జరగరానిది ఏమైనా జరిగితే, అతడి కుటుంబ సభ్యులతో పాటు అప్పు ఇచ్చిన బ్యాంకూ కష్టాల్లో పడుతుంది. హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంటే ఈ సమస్య ఉండదు. పాలసీదారుడు చనిపోయే నాటికి ఇంకా చెల్లించాల్సిన హోమ్‌ లోన్‌ బకాయిలను బీమా కంపెనీ చెల్లిస్తుంది.


కుటుంబానికి ఆసరా

స్పష్టంగా చెప్పాలంటే గృహ రుణ చెల్లింపు గడువులో పాలసీదారుడు మరణిస్తే, మిగిలిన రుణ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. దీనివల్ల చనిపోయిన పాలసీదారుడి కుటుంబ సభ్యులపై ఎలాంటి రుణ చెల్లింపు భారం పడదు. హోమ్‌ లోన్‌ ఇచ్చిన బ్యాంకు వారిని రుణ వసూలు కోసం ఇంటి నుంచి ఖాళీ చేయించలేదు. హోమ్‌ లోన్‌ తీసుకునే వ్యక్తి ఒక్కరే కుటుంబానికి జీవనాధారమైనప్పుడు హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

000-Business.jpg

ఎవరికి అవసరం?

నిజానికి హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు, చాలా కేసుల్లో హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. ఇప్పటికే ఉన్న బీమా పాలసీల కింద ఉన్న కవరేజీ, కుటుంబ బాధ్యతలు, తీసుకునే రుణ మొత్తాన్ని బట్టి ఈ పాలసీ తీసుకోవాలని బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు కోరతాయి.

  • ఇప్పటికే చాలినంత కవరేజీ ఉన్న వ్యక్తులు, హోమ్‌ లోన్‌తో పాటు అదనంగా మరో కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు.

  • ఇతరులు ముఖ్యంగా తన ఆదాయంపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉంటే మాత్రం హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడమే మంచిది.

  • గృహ రుణం తీసుకునేటప్పుడే ఈ విషయాలు అన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే దీని అసలు ప్రయోజనం నెరవేరుతుంది. లేకపోతే ఇంకో భారంగా మారుతుంది.

రుణ చెల్లింపునకు మాత్రమే భరోసా

ఈ పాలసీ ద్వారా ఇంటికి జరిగే నష్టాలకు కూడా భరోసా లభిస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. ఈ పాలసీ కింద హోమ్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగిలిన రుణ బకాయిల చెల్లింపులకు మాత్రమే భరోసా లభిస్తుంది. హోమ్‌ లోన్‌తో కొన్న ఆస్తులకు మాత్రం కాదని గుర్తుంచుకోవాలి. ప్రకృత్తి విపత్తులతో ఆస్తులకు జరిగే నష్టాలకు కూడా బీమా రక్షణ కావాలంటే విడిగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి.

ప్రీమియం చెల్లింపు

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం చెల్లింపు మూడు విధాలుగా ఉంటుంది. ఒకేసారి లేదా గృహ రుణ ఈఎంఐలతో పాటు లేదా ఏడాదికి ఒకసారి చొప్పున చెల్లించవచ్చు. అయితే బ్యాంకులు అంటగట్టే హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునే ముందు జీవిత బీమా కంపెనీలు ఆఫర్‌ చేసే పాలసీలతో బేరీజు వేసుకుని తీసుకుంటే మంచిది.


టర్మ్‌ పాలసీ

మంచిదేమో!

చాలా మంది హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు బదులు, టర్మ్‌ పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. దీనివల్ల ఎక్కువ కవరేజీతో పాటు ప్రీమియం భారమూ తక్కువగా ఉంటుంది. దాంతో పాలసీదారుడు చెల్లించాల్సిన హోమ్‌ బకాయిలతో పాటు అతడి కుటుంబ సభ్యులకూ కొద్దిగా ఆర్థిక ఆసరా కూడా మిగిలే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 05:49 AM