Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 2 రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'!

ABN , Publish Date - May 20 , 2026 | 05:18 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో ప్రధాని పిలుపునకు సానుకూలంగా స్పందించిన తొలి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..  వారానికి 2 రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'!
HDFC Bank Introduces 2-Day Work From Home Policy for Employees

ఆంధ్రజ్యోతి, ఇంటర్నెట్ డెస్క్, మే 20: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది.

అయితే, ఈ సరికొత్త నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పశ్చిమాసియా (Middle East) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు సానుకూలంగా స్పందించిన తొలి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.

ఎవరికి ఈ అవకాశం వర్తిస్తుంది?

బ్యాంకులో కరియర్ పరంగా కస్టమర్లతో నేరుగా సంబంధం లేని (Non-customer facing) అంతర్గత కార్పొరేట్ విభాగాల ఉద్యోగులకు మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది. ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్‌రైటింగ్ అండ్ రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ (IT) సర్వీసెస్ విభాగాలు, హ్యూమన్ రిసోర్సెస్ (HR), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ అండ్ కాంప్లియన్స్, సెక్రటేరియల్ విభాగాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

కస్టమర్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు!

బ్యాంకు బ్రాంచ్‌లలో పనిచేసే సిబ్బంది, రిలేషన్‌షిప్ మేనేజర్లు, లోన్ ఆఫీసర్లు, క్యాషియర్లు వంటి కస్టమర్లతో నేరుగా ముడిపడి ఉండే ఉద్యోగులకు మాత్రం ఈ పాలసీ వర్తించదు. వీరంతా యథావిధిగా ఆఫీసులకు హాజరుకావాల్సి ఉంటుంది. దీనివల్ల ఖాతాదారులకు అందించే రోజువారీ బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

30 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలన

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఈ టూ-డే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రాథమికంగా 30 రోజుల పాటు (నెల రోజుల పాటు) ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను సమీక్షించి, ఈ విధానాన్ని మున్ముందు ఎలా కొనసాగించాలనే దానిపై బ్యాంక్ తుది నిర్ణయం తీసుకోనుంది.


రేసులో మరికొన్ని బ్యాంకులు..

కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఐటీ సహా బ్యాంకింగ్ రంగాలు ఉద్యోగులను పూర్తిగా ఆఫీసులకే పరిమితం చేస్తున్న తరుణంలో, హెచ్‌డీఎఫ్‌సీ మళ్లీ హైబ్రిడ్ మోడల్‌ను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) కూడా తమ కార్పొరేట్ సిబ్బంది కోసం ఇలాంటి హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టగా, యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచే నాన్-కస్టమర్ ఫేసింగ్ రోల్స్ కోసం వారానికి 2 రోజులు ఆఫీస్ విధానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు (SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి) ఎల్‌ఐసీ (LIC) కి కూడా అంతర్గత సమీక్షలు, సమావేశాలను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని, అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

ఇరాన్‌ యుద్ధంతో ఆగ్రహం.. ట్రంప్‌నకు హ్యాండిచ్చిన సొంత పార్టీ సెనేటర్లు

Updated Date - May 20 , 2026 | 06:28 PM