హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,488 కోట్లు
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:39 AM
గత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) హెచ్‌సీఎల్ టెక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.20 శాతం వృద్ధితో రూ.4,488 కోట్లకు...
12 శాతం వృద్ధితో రూ.33,981 కోట్లకు ఆదాయం
ఒక్కో షేరుకు రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) హెచ్‌సీఎల్ టెక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.20 శాతం వృద్ధితో రూ.4,488 కోట్లకు చేరుకుంది. ఏఐ ఆధారిత సేవల్లో బలమైన పనితీరు ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024- 25)లో ఇదే కాలానికి లాభం రూ.4,307 కోట్లుగా నమోదైంది. కాగా, క్యూ4లో కంపెనీ ఆదాయం 12.34 శాతం పెరిగి రూ.33,981 కోట్లకు ఎగబాకింది. 2024-25లో ఇదే కాలానికి రెవెన్యూ రూ.30,246 కోట్లుగా ఉంది. 2025-26లోనే డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, క్యూ4 లాభంలో 10.10 శాతం, ఆదాయంలో 0.32 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.24 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్ల నమోదుకు ఈ నెల 25ను రికార్డు తేదీగా నిర్ణయించిన కంపెనీ.. వచ్చే నెల 5న డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం రూ.16,642 కోట్లకు పరిమితమైంది. 2024-25లో నమోదైన రూ.17,390 కోట్ల లాభంతో పోలిస్తే 4.30 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 11.18 శాతం వృద్ధితో రూ.1,30,144 కోట్లకు పెరిగింది.
క్యూ4లో కంపెనీ యాన్యువలైజ్డ్ అడ్వాన్స్‌డ్ ఏఐ రెవెన్యూ 62 కోట్ల డాలర్లు దాటింది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీకి 193.6 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్ లభించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి లభించిన కొత్త కాంట్రాక్టుల విలువ 932.3 కోట్ల డాలర్లుగా నమోదైంది.
ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 802 పెరుగుదలతో మొత్తం 2,27,181కి చేరుకుంది. ఉద్యోగుల వలసల (అట్రీషన్ రేటు) 12.5 శాతానికి తగ్గింది.
ఈ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి 1-4 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని కంపెనీ అంచనా వేసింది.
బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు ధర మంగళవారం 0.92 శాతం పెరిగి రూ.1,441.55 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..