మూడేళ్లలో ఎస్‌జే-100 విమానం
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:32 AM
ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్, లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) పౌర విమానాల తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం రష్యా కేంద్రంగా పనిచేసే...
నాసిక్ ప్లాంటులో తయారీ
హెచ్‌ఏఎల్ సీఎండీ డీకే సునీల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్, లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) పౌర విమానాల తయారీకి సిద్ధమవుతోంది. ఇందుకోసం రష్యా కేంద్రంగా పనిచేసే యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ) కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పం దం ద్వారా సూపర్ జెట్ 100 (ఎస్‌జే 100) అనే పౌర విమానాన్ని తన నాసిక్ ప్లాంటులో తయారు చేయనుంది. ప్రధాన విమాన భాగాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుని నాసిక్‌లోని తన యూనిట్‌లో అసెంబుల్ చేస్తుంది. ఇలా తయారైన విమానాన్ని మూడేళ్లలో దేశంలోని ప్రాంతీయ విమానయాన సంస్థలకు అందజేచేస్తామని హెచ్‌ఏఎల్ సీఎండీ డీకే సునీల్ చెప్పారు. ఈ లోపు 10-12 ఎస్‌జే 100 విమానాలను నేరుగా దిగుమతి చేసుకుని కొన్ని ప్రాంతీయ విమానయాన సంస్థలకు లీజుకు ఇచ్చే విషయాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేసే కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు సునీల్ చెప్పారు. మన దేశ ప్రాంతీయ విమానయాన రంగంలో ఉన్న విమానయాన సంస్థల నుంచి 200 వరకు ఎస్‌జే 100 విమానాలకు గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హెచ్‌ఏఎల్ ఆదాయంలో పౌర విమానాల వాటా నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే. వచ్చే పదేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచుకుంటామని సునీల్ చెప్పారు.
ఇవీ చదవండి:
ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం
నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..