ఏడాదికి ఒక్కసారే జీఎస్‌టీ రేట్ల సవరణ
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:09 AM
జీఎస్‌టీ రేట్ల సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను ఏడాదిలో ఒకసారే జీఎస్‌టీ మండలి పరిశీలించనుందని, మార్పులు చేస్తే అవి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి...
ఏప్రిల్ 1 నుంచి మార్చిన రేట్ల అమలు
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను ఏడాదిలో ఒకసారే జీఎస్‌టీ మండలి పరిశీలించనుందని, మార్పులు చేస్తే అవి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 8వ తేదీన 57వ జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశ అజెండాలో పన్ను రేట్ల మార్పులు ఏమీ లేవని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో పన్ను రేట్లు, శ్లాబులను హేతుబద్దీకరించారు. అప్పటి వరకు నాలుగు పన్ను శ్లాబులు (5ు, 12ు, 18ు, 28ు) ఉండగా.. వీటిలో 12శాతం, 28శాతం శ్లాబులను తొలగించి 5 శాతం, 18 శాతం శ్లాబులను కొనసాగించిన విషయం తెలిసిందే. కాగా ఈ సారి సమావేశంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరిగే డెలివరీలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం సింగిల్ జీఎస్‌టీ రేటును వర్తింపజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే తమ ఉద్యోగుల బీమా కవరేజీ కోసం కొనుగోలు చేసిన బీమా పాలసీలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను పొందేందుకు కంపెనీలకు అనుమతిచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉద్యోగుల కోసం కంపెనీలు కొన్న ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై పన్ను విధిస్తున్నారు. ఆ పన్నుపై ఐటీసీని పొందే అవకాశం లేదు. మరోవైపు ఏడు రకాల అరుదైన వ్యాధుల చికిత్స కోసం దిగుమతి చేసుకునే ఔషధాలు, కొనుగోలు చేసే ప్రత్యేక ఆహార పదార్థాలను జీఎస్‌టీ నుంచి మినహాయించే ప్రతిపాదన కూడా మండలి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన