Share News

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ నిబంధనల్లో సడలింపు

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:34 AM

వ్యాపార రంగంలో పోటీ పెరుగుతున్న ఈ కాలంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవటానికి వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు వంటి...

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ నిబంధనల్లో సడలింపు

వ్యాపార రంగంలో పోటీ పెరుగుతున్న ఈ కాలంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవటానికి వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు వంటి మధ్యవర్తుల ద్వారా జరిగే అమ్మకాల్లో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఒక సాధారణ పద్దతి. ఈ ముఖ్యమైన ప్రోత్సాహకాల్లో ముఖ్యమైనది డిస్కౌంట్‌ విధానం.

డిస్కౌంట్‌లో రెండు రకాలు: డిస్కౌంట్‌ అనేది సాధారణంగా రెండు రకాలుగా ఉంది. మొదటిది సాధారణ డిస్కౌంట్‌. అంటే వస్తువు కొనుగోలు చేసే సమయానికే ఇన్వాయి్‌సలో చూపించి తగ్గింపు ఇవ్వటం. రెండోది పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌. అంటే అమ్మకం జరిగిన తర్వాత కొన్ని షరతుల మేరకు కొనుగోలుదారుకు అదనంగా డిస్కౌంట్‌ ఇవ్వటం. ఈ పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ అనేది.. అనేక కంపెనీలు తమ డీలర్లను ప్రోత్సహించటానికి అమలు చేసే విధానం. ఉదాహరణకు ఒక సిమెంట్‌ కంపెనీని తీసుకుందాం. ఆ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల ద్వారా సిమెంట్‌ అమ్ముతుంది. కొనుగోళ్లను పెంచటానికి గాను కంపెనీ ఒక పథకం ప్రవేశపెట్టిందనుకుందాం. దీని ప్రకారం, ఒక డీలర్‌ ఒక త్రైమాసికంలో రూ.50 లక్షల మేర కొనుగోలు చేస్తే అతనికి అదనంగా 3 శాతం డిస్కౌంట్‌ ఇవ్వటం. అదే రూ.కోటి కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వటం. ఈ విధంగా అమ్మకం జరిగిన తర్వాత మొత్తం కొనుగోళ్లను పరిశీలించి డిస్కౌంట్‌ లెక్కించి ఇవ్వటం జరుగుతుంది. దీనినే పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ అంటారు.

ప్రత్యేక నిబంధనలున్నాయ్‌: జీఎ్‌సటీ చట్టం ప్రకారం సరఫరాదారు ఇన్వాయిస్‌ జారీ చేసేటప్పుడు ఆ ఇన్వాయిస్‌ విలువపై జీఎ్‌సటీ చెల్లించాలి. అదే సమయంలో కొనుగోలుదారు ఆ జీఎ్‌సటీ మొత్తాన్ని ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) రూపంలో పొందుతాడు. అయితే పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ అనేది ఇన్వాయిస్‌ జారీ చేసే సమయానికి నిర్ణయించబడదు. అమ్మకం జరిగిన తర్వాతే అది లెక్కించబడుతుంది. మరి అప్పటికే మొత్తం ఇన్వాయిస్‌ మీద సదరు కంపెనీ జీఎ్‌సటీ చెల్లించి ఉంటుంది. కాబట్టి దాన్ని తదుపరి రిటర్న్‌లో తగ్గించుకోవటానికి జీఎ్‌సటీ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అంటే ఆయా నిబంధనలు నెరవేరినప్పుడు మాత్రమే పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ను సరఫరా విలువ నుంచి తగ్గించుకోవచ్చు. మొదటి నిబంధన.. పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ ఇవ్వటం గురించి అమ్మ కం జరిగే సమయానికే సరఫరాదారుడు, కొనుగోలుదారుడి మధ్య ఒక ఒప్పందం అగ్రిమెంట్‌ రూపంలో ఉండాలి. రెండో నిబంధన.. డిస్కౌంట్‌ ఇచ్చినప్పుడు ఆ డిస్కౌంట్‌ ఏయే ఇన్వాయి్‌సలకు సంబంధించినదో స్పష్టంగా లింక్‌ చేయగలగాలి. మూడో నిబంధన.. కొనుగోలుదారు తనకు ముందుగా లభించిన ఐటీసీని డిస్కౌంట్‌ మేరకు రివర్స్‌ చేయాలి. ఈ షరతులు నెరవేరినప్పుడే సరఫరాదారుడు తాను చెల్లించిన జీఎస్‌ టీ మొత్తాన్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది.


స్పష్టతనిచ్చిన ప్రభుత్వం: ఇందు లో సంక్లిష్టమైన విషయం ఏమిటంటే.. డిస్కౌంట్‌ మేర ఐటీసీని కొనుగోలుదారు నిజంగా రివర్స్‌ చేశాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటం సరఫరాదారునికి చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఇది అతని చేతిలో లేని పని. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిబంధనను గత సంవత్సరం సడలించింది. అంటే పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ పొందిన మేరకు కొనుగోలుదారుడు ఐటీసీని రివర్స్‌ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ దానిని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత అమ్మకందారుని మీద లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇకపోతే.. ఈ పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌కు సంబంధించి వ్యాపార వర్గాలు ఎదుర్కొనే మరొక సమస్య ఏమిటంటే.. అమ్మకం జరిగే నాటికే అగ్రిమెంట్‌ ఉండాలి అనే నిబంధన. ఎందుకంటే చాలా కంపెనీలు మార్కెట్‌ పరిస్థితులను బట్టి లేదా వ్యాపార అవసరాలను బట్టి డిస్కౌంట్‌ ఇవ్వవచ్చు. డిస్కౌంట్‌ ప్రకటించిన సమయానికే కొన్ని అమ్మకాలు జరిగి ఉండొచ్చు. ముందుగానే అగ్రిమెంట్‌ ఉండాలనే నిబంధన చాలా సందర్భాల్లో వీలుపడదు. ఇలాంటి సందర్భాల్లో డిస్కౌంట్‌ ఇచ్చినప్పటికీ ఆ మేరకు జీఎ్‌సటీ సర్దుబాటు వీలు లేకపోవటంతో చాలా మంది వ్యాపారులు నష్టపోతున్నారు.

ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొన్నటి బడ్జెట్‌లో ఈ నిబంధనను తొలగించింది. దీని అర్ధం ఏమిటంటే, ఒక కంపెనీ అమ్మకం జరిగిన తర్వాత కూడా వ్యాపార అవసరాలను బట్టి డిస్కౌంట్‌ ఇవ్వవచ్చు. ముందుగానే ఒప్పందం ఉండటం తప్పనిసరి కాదు. సరఫరాదారు డిస్కౌంట్‌కు సంబంధించిన క్రెడిట్‌ నోట్‌ జారీ చేస్తే సరిపోతుంది. ఆ క్రెడిట్‌ నోట్‌ ఆధారంగా సరఫరాదారు తాను చెల్లించిన జీఎ్‌సటీ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశం.

అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దీనికి గాను ప్రభుత్వం సంబంధిత నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తుంది. అలాగే కొనుగోలుదారుడు మాత్రం తాను పొందిన డిస్కౌంట్‌ మేర ఐటీసిని తప్పనిసరిగా రివర్స్‌ చేయాలి. ఇంకొక విషయం డిస్కౌంట్‌ను క్రెడిట్‌ నోట్‌ రూపంలో ఇవ్వటానికి క్రెడిట్‌ నోట్స్‌కు సంబంధించిన విధి విధానాలను సరఫరాదారుడు విధిగా పాటించాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వార్తలూ చదవండి:

ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

Updated Date - Mar 22 , 2026 | 04:35 AM