రిజిస్ట్రేషన్ తర్వాత అడ్రస్ మారితే?
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:40 AM
జీఎ్‌సటీ చట్టం కింద నమోదు కావటానికి అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవటానికి చిరునామా అనేది అత్యంత ఆవశ్యకం. అయితే వ్యాపారం మొదట్లో ఉన్న చిరునామా తర్వాత మారిన సందర్భాలు అనేకం...
జీఎ్‌సటీ చట్టం కింద నమోదు కావటానికి అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవటానికి చిరునామా అనేది అత్యంత ఆవశ్యకం. అయితే వ్యాపారం మొదట్లో ఉన్న చిరునామా తర్వాత మారిన సందర్భాలు అనేకం. ఉదాహరణకు ఏదేనీ వృత్తిపరమైన సేవలు అందించటానికి గాను మొదట్లో తమ ఇంటి చిరునామాతో రిజిస్ట్రేషన్ పొంది, వ్యాపారం పెరిగిన తర్వాత స్వయంగా వేరే ఆఫీస్ తీసుకోవచ్చు. లేదా ఉన్న వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక చోటుకు మార్చవచ్చు లేదా స్థల యజమాని ఖాళీ చేయమని అడగొచ్చు. ఇలా చిరునామాలు మారిన సందర్భాలు అనేకం. కారణం ఏదైనా చిరునామా మారిన ప్రతిసారి తప్పనిసరిగా తమ చిరునామాను సరి చేసుకోవాలి. ఇది ఆన్‌లైన్‌లో సులువుగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ చాలా మంది వ్యాపారస్తులు ఈ విషయంలో శ్రద్ధ చూపించరు.
జజీఎస్‌టీ పరిధిలో మార్పు..
అడ్రస్ మారినప్పుడు సంబంధిత జీఎస్‌టీ కార్యాలయం కూడా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు మాదాపూర్ లో ఆఫీస్ ఉన్న వ్యక్తి తన ఆఫీ్‌సను బంజారాహిల్స్‌కు మార్చాడనుకుందాం. అప్పుడు సంబంధిత జీఎ్‌సటీ పరిధి కూడా మారుతుంది. అంటే ఆయా వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు ఇంతకు ముందు మాదాపూర్ జీఎస్‌టీ కార్యాలయ పరిధిలో ఉండగా ఇప్పుడు కొత్త కార్యాలయం పరిధిలోకి వస్తాయి. మరి అలాంటప్పుడు అప్పటికే ఏదేనీ ఇన్వెస్టిగేషన్ లేదా ఆడిట్ లాంటిది జరుగుతుంటే ఆయా సమాచారాన్ని ఎవరికి ఇవ్వాలి అనే సందేహం వ్యాపారస్తుల్లో ఉండేది. అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ లేదా ఆడిట్ మొదలైన తర్వాత అది పూర్తి కావటానికి కొంత సమయం పడుతుంది. మరి ఈ మధ్యలో వ్యాపారస్తుడు తన చిరునామా మార్చుకుంటే.. అప్పుడు ఈ ప్రక్రియను మొదటి కార్యాలయం వారు కొనసాగించాలా? లేదా మారిన ప్రదేశానికి సంబంధించిన కార్యాలయం వారు కొనసాగించాలా? అలాగే, ఆ కొత్త కార్యాలయం మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను మొదలుపెట్టాలా? అలాంటప్పుడు ఆ వ్యాపారస్తుడు తాను ఇంతకు ముందు ఇచ్చిన సమాచారం మొత్తాన్ని తిరిగి కొత్త అధికారికి ఇవ్వాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు వ్యాపారస్తుల్లో, అధికారుల్లో కూడా ఉండేది.
స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
ఈ సందేహాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల వివరణను ఇచ్చింది. దీని ప్రకారం జీఎ్‌సటీ అధికారులు ఏదేనీ చర్యకు ఉపక్రమించిన తర్వాత ఆ వ్యాపారి తన వ్యాపార ప్రదేశాన్ని మార్చుకుని కొత్త జీఎ్‌సటీ పరిధిలోకి వెళితే.. తదుపరి చర్య ఏదైనా కొత్త కార్యాలయం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కంపెనీ 2025 వరకు ఒక ప్రదేశంలో ఉందనుకుందాం. ఆ కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి ఎంక్వైరీ ఒకటి మొదలైంది. దీనిలో భాగంగా ఆ కంపెనీ ఆఫీ్‌సలో సోదాలు మొదలుకావటంతో పాటు కొన్ని పత్రాలను కూడా తీసుకుని రావటం జరిగింది. అలాగే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సమన్లు జారీ చేయటంతో పాటుగా స్టేట్‌మెంట్స్‌ను కూడా రికార్డు చేశారనుకుందాం. ఇప్పుడు ఎంక్వైరీ ప్రక్రియ పూర్తి కాకముందే ఆ కంపెనీ తన ఆఫీ్‌సను 2026లో మరొక ప్రదేశానికి మార్చిందనుకుందాం. మరి తదుపరి ప్రక్రియ ఎవరు పూర్తి చేయాలి? ప్రభుత్వ వివరణ ప్రకారం, తదుపరి ప్రక్రియను కొత్త జీఎ్‌సటీ ఆఫీస్ కొనసాగించాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రక్రియ లేదా ఆడిట్‌లో భాగంగా ఆ కంపెనీ ఇచ్చిన పత్రాలు, స్టేట్‌మెంట్స్ చెల్లుబాటు అవుతాయా అంటే.. అవన్నీ చెల్లుబాటు అవుతాయి. అంటే, జ్యూరి్‌సడిక్షన్ మారినంత మాత్రాన అంతకుముందు జరిగినది చెల్లుబాటు కాకుండా పోదు. కానీ, ముందుకు కొనసాగించటం మాత్రం కొత్త ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంక్వైరీ మొత్తం పూర్తయి నోటీస్ ఇవ్వటం పెండింగ్‌లో ఉన్నా లేదా నోటీస్ ఇచ్చి, ఆర్డర్ పెండింగ్‌లో ఉన్నా.. ఆ ప్రక్రియను కూడా కొత్త కార్యాలయమే చేయాల్సి ఉంటుంది. అలాగే పైన చెప్పినట్లు 2025 వరకు ఉన్న ఆఫీ్‌సను కంపెనీ 2026లో మరొక ప్రాంతానికి మార్చింది కదా. ఆఫీస్ మారిన తర్వాత.. 2026కు ముందు జరిపిన కార్యకలాపాలకు (అంటే 2025 లేదా అంతకుముందు) సంబంధించిన ఆడిట్ చేయాలన్నా లేదా ఎంక్వైరీ చేయాలన్నా అది కూడా కొత్త ఆఫీస్ మాత్రమే చేయాలి. సులభంగా చెప్పాలంటే ఒక వ్యాపారి ఎప్పుడైతే తన చిరునామాను మార్చుకుంటాడో ఆ క్షణం నుంచి కొత్త ఆఫీస్ పరిధిలోకి వస్తాడు. అంటే కాలంతో సంబంధం లేకుండా ఆ వ్యాపారికి సంబంధించిన అన్ని ప్రక్రియలు కొత్త పరిధిలోకి వస్తాయి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
అయితే, ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒక వ్యాపార సంస్థకు వివిధ ప్రదేశాల్లో షాపులు లేదా ఆఫీ్‌సలు ఉండవచ్చు. ముఖ్యంగా బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలు, కార్ల షోరూమ్‌లు, హోటల్స్ మొదలైనవి ఒకటే పేరుతో వివిధ ప్రదేశాల్లో ఉండటం చూస్తుంటాం. అలాంటప్పుడు ముఖ్య ప్రదేశాన్ని (హెడ్ ఆఫీస్).. ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినె్‌సగా గుర్తించగా మిగిలిన వాటిని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్‌గా వ్యవహరిస్తారు. ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద ఏ స్థలాన్ని గుర్తించాలనేది ఆ వ్యాపారి లేదా సంస్థకు సంబంధించిన నిర్ణయం. పైన చెప్పిన నిబంధనలన్నీ కూడా ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మారినప్పుడే వర్తిస్తాయి. అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద నమోదైన ప్రదేశాల్లో మార్పులు జరిగినా ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఆ సంస్థ ఏ పరిధిలోకి వస్తుందనేది ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ చిరునామాని బట్టి నిర్ణయించటం జరుగుతుంది. అలాగే, చిరునామా మార్పు కూడా అదే రాష్ట్రంలో జరిగినప్పుడే పైన తెలిపిన నిబంధనలు వర్తిస్తాయి.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?
'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!