ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు లేదు: కేంద్రం
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:10 PM
లిస్టెడ్ ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును రద్దు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. రిటైల్, దేశీయ ఇన్వెస్టర్లకు ఈ లెవీని తొలగించాలనే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఢిల్లీ, జులై 20: షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును రద్దు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. రిటైల్, దేశీయ ఇన్వెస్టర్లకు ఈ లెవీని తొలగించాలనే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచేందుకు ఈ పన్నును ఉపసంహరించుకోవాలని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వార్షిక బడ్జెట్ ప్రక్రియలో భాగంగా, విస్తృత స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లు సహా పన్ను విధానాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
రద్దు చేయాలని డిమాండ్లు ఎందుకు?
ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం భారీగా పెరగడంతో ఈ పన్నును రద్దు చేయాలనే లేదా మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ పన్ను దీర్ఘకాలిక పెట్టుబడులను నిరుత్సాహపరుస్తోందని, పన్నుల తర్వాత వచ్చే రిటర్న్స్‌ను తగ్గిస్తోందని కొందరు ఇన్వెస్టర్లు వాదిస్తున్నారు. అలాగే, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (FPIs) ప్రభుత్వం ఇటీవల పన్ను మినహాయింపులు ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ ఇన్వెస్టర్లకు కూడా సమానత్వం కల్పించాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి కాసుల వర్షం.. పెరిగిన వసూళ్లు!
ఇన్వెస్టర్ల డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ, ఈక్విటీ లాభాలపై పన్ను వసూళ్లు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఈ పన్నును వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. పార్లమెంట్‌లో షేర్ చేసిన డేటా ప్రకారం.. అసెస్మెంట్ ఇయర్ 2024-25 వసూళ్లు రూ.72,249 కోట్లు కాగా, అసెస్మెంట్ ఇయర్ 2025-26 వసూళ్లు రూ.1,29,158 కోట్లకి పెరిగాయి. కేవలం ఏడాది కాలంలోనే ఎల్‌టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78శాతం వృద్ధి సాధించడం విశేషం. ప్రభుత్వ ఖజానాకు ఈ పన్ను ద్వారా వస్తున్న ఆదాయం ఎంత కీలకంగా మారిందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లు:
లిస్టెడ్ షేర్లు లేదా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేసిన ఒక సంవత్సరం తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా పరిగణిస్తారు. అయితే, ఒక ఆర్థిక ఏడాదిలో రూ.1.25 లక్షల వరకు లాభాలపై ఎలాంటి పన్ను లేదు. రూ.1.25 లక్షల పరిమితి దాటిన లాభాలపై 12.5 శాతం పన్ను విధిస్తారు. ఒక ఏడాది లోపే విక్రయిస్తే వచ్చే షార్ట్ టర్మ్ (STCG) లాభాలపై 20 శాతం పన్ను ఉంటుంది. దీని ప్రకారం 2024 జులై యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పూ లేదు.
మార్కెట్ నిపుణులు, ఇన్వెస్టర్లు ఎల్‌టీసీజీ రేట్లలో ఉపశమనం లభిస్తుందని ఆశించినప్పటికీ, ప్రభుత్వ తాజా వివరణతో ఆ అంచనాలకు బ్రేక్ పడింది. పన్ను విధానాల సమీక్ష అనేది నిరంతర ప్రక్రియే అయినప్పటికీ, ప్రస్తుతానికైతే ఎల్‌టీసీజీ పన్నును రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది ఇవాళ్టి ప్రకటనతో స్పష్టమైంది.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..