లేఆఫ్స్ లేవన్న గూగుల్ ఇండియా.. ఆ 30 మంది తొలగింపుపై వివరణ
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:57 PM
భారత్‌లో గూగుల్ భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతోందన్న వార్తలు వైరల్ కావడంపై సంస్థ స్పందించింది. లేఆఫ్స్ చేపట్టట్లేదని గూగుల్ ఇండియా ఎక్స్ వేదికగా తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గూగుల్ భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతోందన్న వార్తలు వైరల్ కావడంపై సంస్థ స్పందించింది. అలాంటి లేఆఫ్స్ లేవని గూగుల్ ఇండియా ఎక్స్ వేదికగా తెలిపింది. అయితే, క్లౌడ్ ఇండియా విభాగంలో మాత్రం 30 మందిని తొలగించినట్టు అంగీకరించింది. సాధారణ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగానే వారిని తొలగించామని వివరించింది. ఈ విషయంలో వ్యాప్తిలో ఉన్న వార్తలేవీ నిజం కాదని స్పష్టం చేసింది.
నెట్టింట ఉద్యోగుల భయాలు..
పలువురు ఉద్యోగులు లేఆఫ్స్ గురించి నెట్టింట పోస్టులు పెట్టారు. జాబ్ కోతలు, రాజీనామా చేయాలన్న అల్టిమేటమ్స్ వచ్చాయని అన్నారు. భారత్‌లో భారీ స్థాయిలో సిబ్బంది సంఖ్యను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. మరికొందరు ఆందోళన చెందారు. దీంతో, ఈ వదంతులపై గూగుల్ ఇండియా స్పందించాల్సి వచ్చింది. ‘ఇవన్నీ తప్పుడు వార్తలు. గత వారం గూగుల్ క్లౌడ్‌కు చెందిన భారత విభాగంలో స్వల్ప స్థాయి వ్యవస్థాగత మార్పులు జరిగాయి. పని ప్రాధాన్యాల మార్పు నేపథ్యంలో ఓ 30 మందిని తొలగించాల్సి వచ్చింది’ అని గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగం స్పందించింది. అయితే, ఏయే టీమ్స్‌ను, ఉద్యోగుల్నీ తొలగించినదీ మాత్రం వెల్లడించలేదు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు పరిహారం ఇచ్చారా? లేదా? అనే వివరాలు కూడా తెలియరాలేదు.
వృత్తినిపుణులు, ఉద్యోగుల ఆన్‌లైన్ చర్చా వేదిక బ్లైండ్‌లో తొలిసారిగా గూగుల్ లేఆఫ్స్ గురించి పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. క్లౌడ్ టీమ్స్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగిస్తున్నారని కొందరు అన్నారు. బెంగళూరులో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఇది పనితీరుతో సంబంధం లేని తొలగింపులని మరికొందరు అన్నారు. రాజీనామా చేస్తారా? లేదా తీసేయమంటారా? అన్న హెచ్చరికలు కూడా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది ఎక్స్‌లో కూడా కలకలానికి దారితీయడంతో గూగుల్ ఇండియా చివరకు క్లారిటీ ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ఈ వారం వరుసగా రెండోరోజూ పెరిగిన పసిడి ధరలు