2026-27లో ఫార్మా ఎగుమతులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:17 AM
అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నా భారత్ నుంచి ఫార్మాస్యూటికల్ ఎగుమతులు మాత్రం జోరుగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఫార్మా ఎగుమతుల్లో..
రూ.3.10 లక్షల కోట్లు
సవాళ్లున్నా లక్ష్యాన్ని చేరుకుంటాం..
ఫార్మెక్సిల్ డీజీ రాజ భాను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నా భారత్ నుంచి ఫార్మాస్యూటికల్ ఎగుమతులు మాత్రం జోరుగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఫార్మా ఎగుమతుల్లో 5-6 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ కే రాజ భాను వెల్లడించారు. సోమవారం నాడిక్కడ సీపీహెచ్‌ఐ ఇండియా -2026 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026-27లో ఫార్మా ఎగుమతులు 3,200-3,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.10 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతులు తగ్గినా కొత్త మార్కెట్లకు చేరుకోవటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు.
లాటిన్ అమెరికా, ఆఫ్రికాలపై నజర్: భారత్ నుంచి ఫార్మా ఎగుమతుల కోసం ప్రధానంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాన్ దేశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించటం ద్వారా ఇప్పటికే సత్ఫలితాలను రాబట్టుకోగలిగినట్లు రాజ భాను వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో సరఫరాపరంగా అవాంతరాలు ఏర్పడినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినట్లు ఆయ న పేర్కొన్నారు. కొన్ని దేశాల నుంచి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు సరఫరా వ్యవస్థలో పలు మార్గాలను అన్వేషించటం ద్వారా ఫార్మా రంగంపై ప్రభావం పడకుండా చూడగలిగినట్లు చెప్పారు.
రూ.5.08 లక్షల కోట్ల టర్నోవర్: గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా రంగ వార్షిక టర్నోవర్ రూ.5.08 లక్షల కోట్లకు చేరుకుందని ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఎండీ యోగేశ్ ముద్రాస్ వెల్లడించారు. గడచిన ఐదేళ్లుగా ఫార్మా పరిశ్రమ ఏటా సగటున 9.2 శాతం వృద్ధిని నమోదు చేస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేశీయంగా మెడికల్ డివైసెస్ తయారీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.28,000 కోట్లుగా ఉంటే.. 2024-25 నాటికి రూ.41,500 కోట్లకు చేరుకుందన్నారు. రానున్న రోజుల్లో అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బయోలాజిక్స్, స్పెషలైజ్డ్ థెరపీలు, కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ వంటి హై వాల్యూ విభాగాల్లో మంచి వృద్ధిని కనబరిచే అవకాశం ఉందని యోగేశ్ తెలిపారు.