Share News

అందుకు ఒప్పుకోకపోతే సంస్థను వీడొచ్చు.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన గూగుల్

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:23 PM

ఏఐని, ఇందుకు సంబంధించిన గూగుల్ ప్రణాళికలను స్వీకరించలేని ఉద్యోగులు సంస్థను వీడొచ్చని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ తాజాగా ఉద్యోగులకు లేఖ రాశారు. ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని తీసుకొచ్చినట్టు కూడా తెలిపారు.

అందుకు ఒప్పుకోకపోతే సంస్థను వీడొచ్చు.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన గూగుల్
Google voluntary Exit Programme For Employees

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రంగానికి సంబంధించి గూగుల్ ప్లాన్స్‌తో (Google's AI Plans) ఏకీభవించలేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవచ్చని సంస్థ తాజాగా పేర్కొంది. గూగుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (జీబీఓ) విభాగానికి చెందిన ఉద్యోగులకు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఓ అంతర్గత లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా అడ్వర్‌టైజమెంట్, సర్వీసులు తదితర బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ విభాగానికి చెందిన వారిని ఉద్దేశించి షిండ్లర్ ఈ లేఖను పంపారని తెలుస్తోంది (Voluntary Exit Programme).

2026 సంవత్సరాన్ని గూగుల్ మంచి లాభాలతో మొదలుపెట్టినప్పటికీ ఏఐ రంగంలో నిత్య మార్పులు తప్పవని షిండ్లర్ పేర్కొన్నారు. మెరుపు వేగంతో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వెనకబడితే కోల్పోయేది చాలా ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి, ఏఐకి సంబంధించి కంపెనీ ప్రణాళికలతో ఏకీభవించలేని, అంగీకరించలేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని సూచించారు. ఏఐతో కలిగే పెను ప్రభావాలను స్వీకరించకతప్పదని చెప్పారు. ఇలా కుదరదన్న వారు సంస్థను వీడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు పరిహారాన్ని కూడా సంస్థ చెల్లిస్తుందని తెలిపారు.


సొల్యూషన్స్ విభాగం, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల్లోని వారికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఆఫర్ చేశారు. జీబీఓ విభాగం కార్యకలాపాలు గూగుల్ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైనప్పటికీ రాబోయే రోజుల్లో కస్టమర్లకు ఎలాంటి సేవాలోపం లేకుండా ఉండేందుకు ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపారు. గతేడాది అమెరికాలో కూడా గూగుల్ తన ఆండ్రాయిడ్, కోర్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆఫర్‌ను ఇచ్చింది.

ఇక గూగుల్‌తో పాటు అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్‌లు కూడా తమ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు దిగాయి. ఏఐ ఆధారిత బిజినెస్ విధానాల వైపు మళ్లే క్రమంలో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని ఇచ్చాయి.


ఇవి కూడా చదవండి..

దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్‌ డీల్‌పై రాహుల్ గాంధీ

మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్‌‌ ప్రశ్నల వర్షం

Updated Date - Feb 11 , 2026 | 05:45 PM