బంగారం, వెండి భగ్గు
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:09 AM
శీయంగా విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.4,800 ఎగబాకి రూ.1,46,600 వద్ద ముగిసింది....
పసిడి ధర రూ.4,800 అప్
రూ.9,000 ఎగబాకిన వెండి
అమెరికా ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.4,800 ఎగబాకి రూ.1,46,600 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.9,000 పెరుగుదలతో రూ.1.93 లక్షలకు చేరింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. పండుగల సీజన్ కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 3 శాతం వృద్ధితో 4,043.93 డాలర్లకు, ఔన్స్ వెండి 4.5 శాతం లాభంతో 52.03 డాలర్లకు చేరాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగలడం, డాలర్ బలహీనపడటం, కేంద్ర బ్యాంకులు మళ్లీ పసిడి కొనుగోళ్లకు దిగాయన్న వార్తలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబరులో ప్రామాణిక వడ్డీ రేట్లు పెంచక పోవచ్చనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.
ర్యాలీ కొనసాగేనా?: బులియన్ మార్కెట్‌లో బుధవారం కనిపించిన ఈ ర్యాలీ కొనసాగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటులో మార్పులు, అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై రాబడులు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వు తీసుకునే చర్యలు పసిడి ధరల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు అదుర్స్
గత ఆరు నెలల్లో పసిడి ధర 12 శాతం తగ్గడం గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్)కు బాగా కలిసొచ్చింది. దీంతో ఈ ఏప్రిల్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.1.58 లక్షల కోట్లుగా ఉన్న పెట్టుబడులు, అక్టోబరు నెలాఖరుకు రూ.1.91 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం ధరలు తగ్గినా, త్వరలోనే మళ్లీ ధరలు పెరుగుతాయనే అంచనాతో చాలా మంది మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెంచారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్‌లో రాబడులపై అనిశ్చితి ఇందుకు మరింత దోహదం చేశాయి. పండుగలు, పెళ్ళిళ్ల సీజన్ కొనుగోళ్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు తెచ్చిపెడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధన త్రయోదశి అమ్మకాలపై నిరాశ
ఈ నెల 6న ధన త్రయోదశి సందర్భంగా బంగారు ఆభరణాల అమ్మకాలపై నగల వ్యాపారులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ ధరలతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర 20 శాతం, వెండి ధర 50 శాతం తగ్గాయి. అయినప్పటికీ, గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ధరలు ఇంకా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..