పసిడి, వెండి ధరలు ఢమాల్.. వరుసగా రెండో రోజూ భారీ పతనం
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:07 AM
నిన్న రికార్డు స్థాయిలో పడిపోయిన వెండి, బంగారం ధరలు నేడూ అదే ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు కిలో వెండి ధర ఏకంగా రూ.55 వేల మేర పడిపోయి రూ.3.5 లక్షలకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరల ధోరణి రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న (శుక్రవారం) రికార్డు స్థాయిలో పడిపోయిన ధరలు శనివారం అంతకు మించి పతనాన్ని చవి చూస్తున్నాయి. భారత్‌లో నేడు ట్రేడింగ్ మొదట్లోనే వెండి ధర సగటున రూ.45 వేల మేర పతనం కాగా, మేలిమి బంగారం ధర కూడా రూ.8 వేల మేర పడిపోయింది (Silver, Gold Huge Crash on Jan 31 Hyderabad).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం (జనవరి 31) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.8,620 మేర తగ్గి రూ.1,60,058కు చేరింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర రూ.7,900 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర మాత్రం మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమైంది. ఏకంగా రూ.55 వేల మేర తగ్గి రూ.3,50,000 లక్షలకు చేరింది.
ఢిల్లీలో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,730గా ఉంది. చెన్నైలో రూ.1,62,550 వద్ద, ముంబైలో రూ.1,60,580 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర ఢిల్లీలో రూ.1,47,350 వద్ద కొనసాగుతుండగా, చెన్నై, ముంబైల్లో వరుసగా రూ.1,49,000, రూ.1,47,200 వద్ద ట్రేడవుతోంది. దేశంలో పలు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3.50 లక్షలకు పడిపోయింది. వరుసగా రెండో రోజూ ధరలు ఈ స్థాయిలో తిరోగమనంలో పయనిస్తుండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. స్పాట్ మార్కెట్‌లో రెండు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు. రూ.17 వేల మేర పడిపోగా కిలో వెండి ధర రూ.60 వేల మేర తగ్గింది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!
బడ్జెట్ 2026: కేంద్ర విత్త మంత్రి మరో ఘనత సాధిస్తారా.?