Share News

పసిడి డిమాండ్‌కు ధరల సెగ

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:29 AM

దేశీయ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు ఒక హద్దు అనేది లేకుండా దూసుకుపోతున్న ప్రభావం డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్‌లో కూడా బంగారం కొనుగోళ్లు గత ఏడాదితో పోల్చితే తగ్గడమే...

పసిడి డిమాండ్‌కు ధరల సెగ

ఈ ఏడాది డిమాండ్‌ 700 టన్నుల లోపే: డబ్ల్యూజీసీ

న్యూఢిల్లీ: దేశీయ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు ఒక హద్దు అనేది లేకుండా దూసుకుపోతున్న ప్రభావం డిమాండ్‌పై పడింది. వివాహాల సీజన్‌లో కూడా బంగారం కొనుగోళ్లు గత ఏడాదితో పోల్చితే తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2025లో బంగారం డిమాండ్‌ అంతకు ముందు ఏడాదితో పోల్చితే 11ు క్షీణించి 802.8 టన్నుల నుంచి 710.9 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది డిమాండ్‌ 600-700 టన్నులకే పరిమితం కావచ్చని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. దేశంలోను, ప్రపంచ స్థాయిలోనూ బంగారం ధరల తీరుతెన్నులపై డబ్ల్యూజీసీ ఒక నివేదిక విడుదల చేసింది. వివాహాల సీజన్‌లో సైతం బంగారం డిమాండ్‌ 23ు క్షీణించి 145.3 టన్నులకు పరిమితమైనట్టు సంస్థ ప్రాంతీయ సీఈఓ సచిన్‌ జైన్‌ అన్నారు. ఇక అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో (క్యూ4) డిమాండ్‌ 9ు పడిపోయి 241.3 టన్నులకు పరిమితమైంది. 2024తో పోల్చితే ఆభరణాల డిమాండ్‌ సైతం 24ు తగ్గి 563.4 టన్నుల నుంచి 430.5 టన్నులకు పడిపోయింది. విలువపరంగా మాత్రం డిమాండు రూ.4,04,510 కోట్ల నుంచి రూ,4,54,390 కోట్లకు పెరిగింది.

విలువలో ఘనమే: బంగారం డిమాండ్‌ పరిమాణంపరంగా తగ్గినా విలువపరంగా మాత్రం దూసుకుపోయింది. 2024లో బంగారం కొనుగోళ్ల విలువ రూ.5,75,930 కోట్లుండగా గత ఏడాది రూ.7,51,490 కోట్లకు దూసుకుపోయింది. సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటే 2024 జనవరిలో ఇది రూ.70,754 ఉండగా 2025 జనవరి నాటికి 67ు పెరిగి రూ.1,01,572కి చేరింది.

ప్రపంచ డిమాండ్‌ 5000 టన్నులు: ప్రపంచంలో బంగారం డిమాండ్‌ 2025లో 5,000 టన్నుల మైలురాయిని దాటింది. 2024లో డిమాండ్‌ 4,961.9 టన్నులుండగా 2025లో అది 5,002 టన్నులకు చేరిందని డబ్యూజీసీ తెలిపింది. ఇదే కాలంలో ప్రధానంగా పెట్టుబడి డిమాండ్‌ 1,185.4 టన్నుల నుంచి 2,175 టన్నులకు దూసుకుపోయింది. ధరల్లో ఎప్పటికప్పుడు భారీ వృద్ధి చోసుకుంటున్న తరుణంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యత పెరగడమే ఇందుకు కారణం.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..

యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..

Updated Date - Jan 30 , 2026 | 06:30 AM