పశ్చిమాసియా, తూర్పు యూర్‌పలపై జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ దృష్టి
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:12 AM
జీఎంఆర్ గ్రూప్.. విమానాశ్రయాలు, వాటి అనుబంధ వ్యాపారాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా పశ్చిమాసియా, మధ్య ఆసియా, తూర్పు యూరప్, ఆగ్నేయాసియాలో విమానాశ్రయాలు, వాటిలోని...
చైర్మన్ జీఎం రావు వెల్లడి
న్యూఢిల్లీ: జీఎంఆర్ గ్రూప్.. విమానాశ్రయాలు, వాటి అనుబంధ వ్యాపారాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా పశ్చిమాసియా, మధ్య ఆసియా, తూర్పు యూరప్, ఆగ్నేయాసియాలో విమానాశ్రయాలు, వాటిలోని వ్యాపార అవకాశాలను అన్వేషించనున్నట్టు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు పేర్కొన్నారు. పెరుగుతున్న ఆదాయాలు, పర్యాటక విస్తరణ, విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ ప్రగతిశీల కార్యక్రమాల మద్దతుతో భారతీయ విమానయాన రంగం దీర్ఘకాలంలో వృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డ్యూటీ ఫ్రీ, కార్గో, రిటైల్, ఫుడ్ అండ్ బేవరేజ్ వంటి విమానాశ్రయ అనుబంధ వ్యాపారాల్లోకి ప్రవేశించి కంపెనీ తన ‘ఎయిర్‌పోర్ట్ ప్లాట్‌ఫామ్’ పోర్ట్‌ఫోలియోను విస్తరించినట్టు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదిక లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. భవిష్యత్తులో తాము కొత్త విమానాశ్రయ కన్సెషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే.. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు, విమానాశ్రయ అనుబంధ వ్యాపారాలను విస్తరిస్తామని చెప్పారు.
అపార అవకాశాలున్నాయ్..
ప్రపంచ విమానయాన పరిశ్రమ ప్రధానంగా పశ్చిమాసియా, మధ్య ఆసియా, తూర్పు యూరప్, ఆగ్నేయాసిలోని వర్ధమాన మార్కెట్లలో విస్తరిస్తూనే ఉందని రావు పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాలకు అపార అవకాశాలను అందిస్తున్నాయని, ఇలాంటి అవకాశాలను తాము అన్వేషిస్తున్నామన్నారు. అయితే ఒడుదొడుకులు, అనిశ్చితి, అస్పష్టమైన ప్రపంచంలో మనం జీవిస్తున్న విషయాన్ని తాము గుర్తిస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్ ప్లాట్‌ఫామ్ వ్యాపారాలను కొత్త విమానాశ్రయాలకు, భౌగోళిక ప్రాంతాలకు గ్రూప్ విస్తరిస్తుందన్నారు. విభిన్న రంగాలకు విస్తరించిన జీఎంఆర్ గ్రూప్‌లో భాగంగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్... దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా ఆరు విమానాశ్రయాలను, ఇండోనేషియాలో ఒక ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తోంది. గ్రీస్‌లో ఒక ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఈ నెల 17 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జీఎంఆర్ విమానాశ్రయాల ద్వారా 11.46 కోట్ల మంది ప్రయాణించారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రూ.472 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నష్టాలను చవిచూసింది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు