4 నెలలు.. రూ.1.89 లక్షల కోట్లు
ABN , Publish Date - May 01 , 2026 | 04:54 AM
పశ్చిమాసియా యుద్ధం విదేశీ పోర్టుఫోలియో సంస్థల (ఎఫ్‌పీఐ)ను భయపెడుతోంది. ఈ భయంతో ఈ సంస్థలు పొలోమంటూ దేశీయ స్టాక్ మార్కెట్‌కు గుడ్‌బై చెబుతున్నాయి.
పశ్చిమాసియా యుద్ధంతో ఎఫ్‌పీఐల బేజార్
జోరుగా షేర్ల అమ్మకాలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధం విదేశీ పోర్టుఫోలియో సంస్థల (ఎఫ్‌పీఐ)ను భయపెడుతోంది. ఈ భయంతో ఈ సంస్థలు పొలోమంటూ దేశీయ స్టాక్ మార్కెట్‌కు గుడ్‌బై చెబుతున్నాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ఎఫ్‌పీఐలు భారత స్టాక్ మార్కెట్ నుంచి 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.89 లక్షల కోట్లు) విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గత ఏడాది (2025) మొత్తం మీద ఈ సంస్థలు అమ్మిన 1,890 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 110 కోట్ల డాలర్లు (సుమారు రూ.10,432 కోట్లు) మాత్రమే తక్కువ. అయితే ఈ అమ్మకాలు గత నాలుగు నెలల్లోనే జరగడం విశేషం. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టీ 50 సూచీ 8.2 శాతం, సెన్సెక్స్ 9.8 శాతం నష్టపోయాయి.
మరింత హోరుగా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రంకెలు వేసినా.. ఎన్ని బెదిరింపులకు దిగినా ఇరాన్ జీ హుజూర్ అనడం లేదు. దీంతో గల్ఫ్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు చమురు సెగ రోజురోజుకీ భయపెడుతోంది. ఈ యుద్ధానికి ముందు బ్యారల్ 70-75 డాలర్లు పలికిన బ్రెంట్ రకం ముడి చమురు ధర ఇప్పటికే 125 డాలర్లను తాకింది. ఈ యుద్ధం రావణ కాష్టంలా మరింత కాలం కొనసాగితే మన దేశ ఆర్థిక పునాదులూ బీటలు వారే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ లు తమ పెట్టుబడులను మరింత భారీగా వెనక్కి తీసుకునే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే నిఫ్టీ 50 సూచీ 20,000 పాయింట్ల దిగువకు వచ్చినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు