పండగ సీజన్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:03 AM
పండగ సీజన్ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయని వినియోగదారులు ఆశిస్తున్న తరుణంలో ఎయిర్ కండీషనర్లు, ఇతర కన్స్యూమర్...
గృహోపకరణాల కంపెనీల ఆశాభావం
న్యూఢిల్లీ: పండగ సీజన్ నేపథ్యంలో ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయని వినియోగదారులు ఆశిస్తున్న తరుణంలో ఎయిర్ కండీషనర్లు, ఇతర కన్స్యూమర్ అప్లయెన్సెస్ ధరలను కంపెనీలు 5-8 శాతం మేర పెంచేశాయి. అయినప్పటికీ ఈ పండగ సీజన్ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావంతో ఉన్నాయి. ప్రీమి యం ఉత్పత్తుల వాడకం, పాత వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడం, సులభంగా ఫైనాన్స్ లభించడం, మెరుగైన వినియోగదారుల సెంటిమెంట్ వంటివి అమ్మకాల్లో వృద్ధికి దోహదపడతాయని కంపెనీలు భావిస్తున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు, ముడి చమురు ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు రవాణా వ్యయాలు పెరగడం, కరెన్సీ విలువలో హెచ్చుతగ్గుల మూలంగా కంపెనీలు తాజాగా ధరలను పెంచాయి. ధరలను పెంచడం ఈ ఏడాదిలో మూడోసారి కావడం గమనార్హం. కాగా దక్షిణాదిలో ఓనమ్ సందర్భంగా బలమైన అమ్మకాలు నమోదు కావడంతో ఇదే ఊపు నవరాత్రులు, దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది.
హాయర్: ధరలను పెంచినప్పటికీ పరిశ్రమ రెండంకెల వృద్ధిని కచ్చితంగా నమోదు చేస్తుందన్న విశ్వాసాన్ని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా సీఈఓ ఎన్‌ఎ్‌స సతీష్ వ్యక్తం చేశారు. పండగ సీజన్ అమ్మకాల్లో విలువపరంగా 30-35 శాతం, యూనిట్ల అమ్మకాలపరంగా దాదాపు 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ వృద్ధి 10-15 శాతం ఉండవచ్చని సతీష్ తెలిపారు.
ఎల్‌జీ: రాబోయే పండగ సీజన్‌పై తాము చాలా ఆశాజనకంగా ఉన్నామని ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్ ఇండియా కో-చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ సంజయ్ చిట్కారా తెలిపారు. వినియోగదారులు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, ఎయిర్‌కండీషనర్లను మాత్రమే అప్‌గ్రేడ్ చేయడం లేదని.. డిష్‌వాషర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఆడియో ఉత్పత్తులు, వాటర్ ప్యూరిఫయర్లు వంటి వాటిని అన్వేషిస్తున్నారని చెప్పారు.
సోనీ: ఈ పండగల సీజన్‌లో మొత్తంగా విలువ వృద్ధి సుమారు 15-20 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయన్ తెలిపారు. ఈ ఏడాది పండగ సీజన్ బలంగా ఉంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. ప్రీమియం ఉత్పత్తులు, కొత్త ఉత్పత్తుల విడుదల, వినియోగదారుల ఆఫర్లు డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
గోద్రెజ్: రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, ఎయిర్ కండీషనర ్ల కొనుగోలుకు పండగల సీజన్ మంచి అవకాశమని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ (అప్లయెన్సెస్ డివిజన్) హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ వాతావరణం ఉన్నప్పటికీ ఓనమ్ సందర్భంగా తమ అమ్మకాలు జోరుగా సాగాయన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా పండగ డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..
బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..