పండగల సీజన్‌లో 2.7 లక్షల గిగ్ ఉద్యోగాలు!
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:30 AM
ఈ ఏడాది పండగల సీజన్‌లో 2.5-2.7 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ, టాలెంట్ సంస్థ అడెక్కో ఇండియా అంచనా వేస్తోంది....
ముంబై: ఈ ఏడాది పండగల సీజన్‌లో 2.5-2.7 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ, టాలెంట్ సంస్థ అడెక్కో ఇండియా అంచనా వేస్తోంది. ఈ-కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్, వ్యవస్థీకృత రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎ్‌ఫఎ్‌సఐ) రంగాల్లో ఈ నియామకాలకు ఆస్కారం ఉందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది పండగల సీజన్‌లో తాత్కాలిక, గిగ్ నియామకాలు వార్షిక ప్రాతిపదికన 15-20 శాతం పెరగనున్నట్టు అంచనా వేసింది. గత ఏడాది వ్యవస్థీకృత రంగంలో సుమారు 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్టు పేర్కొంది. ‘‘ప్రపంచ వ్యాపార వాతావరణం మరింత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది పండగ సీజన్‌లో నియామకాల పట్ల ఆసక్తి బలంగా ఉంది. రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఇతర వినియోగదారుల ఆధారిత రంగాల్లో దేశీయ వినియోగ డిమాండ్ మద్దతు కొనసాగుతున్నప్పటికీ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు, మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితులు, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో యజమానులు మరింత జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తున్నారు’’ అని అడెక్కో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ జనరల్ స్టాఫింగ్ దీపేష్ గుప్తా పేర్కొన్నారు.
45% ద్వితీయ శ్రేణి నగరాల నుంచే..
ఇక ఈ సంవత్సరం సిబ్బంది డిమాండ్‌లో సుమారు 45 శాతం లఖ్‌నవూ, భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ మార్కెట్లలో ఈ-కామర్స్ విస్తరించడం, వ్యవస్థీకృత రిటైల్ వృద్ధి, వినియోగంలో పెరుగుదల ఇందుకు కారణాలుగా తెలిపింది. ఇదే సమయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా ప్రథమ శ్రేణి నగరాలు 30 శాతం తీవ్ర ప్రతిభ కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఉద్యోగుల వలసలు, గిగ్ వర్క్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం కారణంగా నియామకాలతో పాటు సిబ్బందిని నిలుపుకోవడం సవాలుగా మారుతోందని నివేదిక వివరించింది.
ఇక మెట్రో మార్కెట్లలో తాత్కాలిక వేతనాలు 12-15 శాతం.. ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో 8-10 శాతం పెరిగే అవకాశం ఉంది. రిటైల్ సేల్స్ అసోసియేట్లు, కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్‌లు, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, మర్చంటైజర్లు, బీఎ్‌ఫఎ్‌సఐ రంగ నియామకాల్లో డిమాండ్ ఉంటోందని పేర్కొంది. హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో నైపుణ్యం ఉండటంతో పాటు డిజిటల్ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలున్న వారి కోసం ఎక్కువగా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా