Share News

ఈబే సంస్థలోనూ లేఆఫ్స్!

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:09 PM

ఈబే సంస్థ మరోసారి లేఆఫ్స్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 800 మందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.

ఈబే సంస్థలోనూ లేఆఫ్స్!
eBay layoffs 800 employee

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే మరోసారి లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఈమారు 800 మందిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. వ్యూహాత్మక ప్రాధాన్యాలకు అనుగుణంగా సంస్థలో మార్పులు చేస్తున్నట్టు తెలిపింది (Ebay Layoffs).

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిబ్బందిలో మార్పులు చేసేందుకు ఇది అవసరమని ఈబే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని, ఏ ఒక్క శాఖకు ప్రత్యేకంగా పరిమితం కాదని పేర్కొంది.

సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్‌ప్లేస్ డీపాప్‌ను 1.2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్టు ఈబే ఇటీవలే ప్రకటించింది. జన్ జీ, మిలీనియల్ తరానికి చెందిన కస్టమర్లకు చేరువయ్యే వ్యూహంలో భాగంగా ఈ డీల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈబేలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 12,300 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024లో కూడా ఈబే లేఆఫ్స్‌కు పూనుకుంది. అప్పట్లో సుమారు వెయ్యి మందిని తొలగించింది.


ఇక ఉద్యోగుల తొలగింపులతో పాటు ఇటీవల కాలంలో ఈబే కృత్రిమ మేధపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐతో పాటు ఇతర ఏఐ సంస్థలతో జట్టు కట్టింది. ఇప్పటికే ఈబేకు వాల్‌మార్ట్, అమెజాన్ సంస్థల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఎట్కీ, టిక్‌టాక్ షాప్ వంటి ఆన్‌‌లైన్ వేదికలు కూడా వేగంగా ఎదుగుతూ ఈబేకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఇటీవల ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం అంచనాలకు అనుగుణంగా పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం మేర పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 27 , 2026 | 02:40 PM