Share News

ఈ-కామర్స్‌ సంస్థల ఆగడాలకు చెక్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:24 AM

ఈ-కామర్స్‌ సంస్థల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్‌) చట్టం నిబంధనలను ‘వినియోగదారుల...

ఈ-కామర్స్‌ సంస్థల ఆగడాలకు చెక్‌

నిబంధనలు కఠినతరం

2027 జనవరి1 నుంచి అమలు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ సంస్థల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 2020 నాటి వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్‌) చట్టం నిబంధనలను ‘వినియోగదారుల రక్షణ చట్టం (ఈ-కామర్స్‌, సవరణ) నిబంధనలు, 2026 పేరుతో సవరించింది. ఈ సవరణ ద్వారా ఈ సంస్థల ధరల నిర్ణయం, స్పాన్సర్డ్‌ లిస్టింగ్స్‌లో పారదర్శకత ఏర్పడటంతో పాటు ఉత్పత్తుల సెర్చ్‌ ఫలితాలను తారుమారు చేయడం, డార్క్‌ ప్యాటర్న్స్‌గా పిలిచే అక్రమాలకు చెక్‌ పడుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ (డీసీఏ) తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సవరించిన కొత్త ఈ-కామర్స్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూనే దేశంలో పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన వినియోగదారుల ఆధారిత ఈ-కామర్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ సవరణలు అమలు చేయబోతున్నట్టు డీసీఏ తెలిపింది.

ప్రధాన సవరణలు

  • ధరలు తగ్గిస్తే.. డిస్కౌంట్‌ ప్రకటించడానికి నెల రోజుల ముందు ఉన్న అతితక్కువ ధర ఎంతో ఈ-కామర్స్‌ సంస్థలు వెల్లడించాలి

  • ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగదారులను తప్పుదారి పట్టించడం, వారి పరిశీలించిన, వెతికిన (సెర్చ్‌) ఫలితాలను తారుమారు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు

  • స్పాన్సర్డ్‌ లిస్టింగ్స్‌ను వినియోగదారులు స్పష్టంగా గుర్తించేలా.. కంపెనీలు పూర్తి సమాచారం వెల్లడించాలి

  • ఈ-కామర్స్‌ సంస్థలు ఏటా ఒకసారి తప్పనిసరిగా.. తాము గైడ్‌లైన్స్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డార్క్‌ ప్యాటర్న్స్‌, 2023 నిబంధనలు పాటిస్తున్నట్టు సెల్ఫ్‌ ఆడిట్‌ సర్టిఫికెట్‌ డీసీఏకు సమర్పించి దాన్ని తమ వెబ్‌సైట్లలోనూ ప్రదర్శించాలి

  • ప్రతి ఈ-కామర్స్‌ సంస్థ నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌లైన్‌ ఏకీకరణ ప్రక్రియలో తప్పనిసరిగా భాగస్వామి కావాలి

  • ప్రతి ఈ-కామర్స్‌ సంస్థ గ్రీవెన్స్‌ అధికారి వినియోగదారులకు వారి ఫిర్యాదుల పురోగతిపై ప్రత్యేక సర్టిఫికెట్‌ జారీ చేయాలి

  • వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ-కామర్స్‌ సంస్థలు ఆయా ఉత్పత్తుల బెస్ట్‌ బిఫోర్‌, యూజ్‌ బిఫోర్‌ తేదీలు, రిటర్న్‌లు, రిఫండ్స్‌, వారెంటీ, డెలివరీ, చెల్లింపులకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించాలి

  • ఈ-కామర్స్‌ సంస్థలు దిగుమతి చేసుకున్న వస్తువులను అమ్ముతుంటే దిగుమతిదారు వివరాలు, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు? వంటి వివరాలు వెల్లడించాలి.

  • వినియోగదారుల అనుమతి లేకుండా ఈ-కామర్స్‌ సంస్థలు వారి వివరాలను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:24 AM