Share News

డాక్టర్‌ రెడ్డీస్‌కు అమెరికా దెబ్బ

ABN , Publish Date - May 13 , 2026 | 02:17 AM

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి...

డాక్టర్‌ రెడ్డీస్‌కు  అమెరికా దెబ్బ

మార్చి త్రైమాసిక లాభంలో 86ు క్షీణత

రూ.220 కోట్లుగా నమోదు

యూఎస్‌ ఆదాయంలో 51ు తగ్గుదల

ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఏకంగా 86 శాతం క్షీణించి రూ.220.10 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం 1,593 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 11 శాతం క్షీణించి రూ.8,506 కోట్ల నుంచి రూ.7,516 కోట్లకు చేరుకుంది. ప్రధానంగా అమెరికా మార్కెట్‌ ఆదాయాలు ఏకంగా 51 శాతం తగ్గటం పనితీరుపై ప్రభావం చూపించిందని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ అమెరికా ఆదాయం రూ.3,558.60 కోట్ల నుంచి రూ.1,756.20 కోట్లకు పడిపోయింది. యూఎస్‌ మార్కెట్లో జెనరిక్‌ క్యాన్సర్‌ ఔషధం రెవెలిమిడ్‌ (లెనాలిడొమైడ్‌) విక్రయాలు గణనీయంగా తగ్గటం ప్రధాన కారణంగా ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. అమెరికాలో విక్రయాలు తగ్గినప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయంలో యూఎస్‌ మార్కెట్‌ వాటా 34 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయుతే కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, బ్రాండెడ్‌ వ్యాపారంలో వృద్ధి కలిసి వచ్చిందని ఆయన తెలిపారు.

భారత్‌ ఆదాయంలో 20శాతం వృద్ధి: అమెరికా ఆదాయాలు భారీగా తగ్గినప్పటికీ భారత మార్కెట్‌ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.1,305 కోట్ల నుంచి రూ.1,566 కోట్లకు చేరుకున్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. మరోవైపు యూరప్‌ మార్కెట్‌ ఆదాయం కూడా 14 శాతం పెరిగి రూ.1,275 కోట్ల నుంచి రూ.1,452 కోట్లకు చేరుకోగా వర్ధమాన దేశాల మార్కెట్‌ రెవెన్యూలు కూడా 29 శాతం పెరిగినట్లు పేర్కొంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.33,593 కోట్ల ఆదాయంపై రూ.4,285 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే గడచిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.8 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


త్వరలో భారత మార్కెట్లోకి సెమాగ్లుటైడ్‌: భారత మార్కెట్లోకి డయాబెటిస్‌, వెయిట్‌లాస్‌ జెనరిక్‌ ఔషధం సెమాగ్లుటైడ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ ఎరెజ్‌ ఇజ్రాయెల్‌ తెలిపారు. సాధ్యమైనంత తర్వగా దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెమాగ్లుటైడ్‌ ఔషధానికి గత నెలలోనే డీసీజీఐ ఆమోదం తెలిపింది. కాగా రానున్న కొద్ది రోజుల్లోనే కెనడా మార్కెట్లోకి ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు ఎరెజ్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 02:17 AM