డాక్టర్ రెడ్డీస్ నుంచి హెచ్‌ఐవీ ఔషధం
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:55 AM
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ తన జెనరిక్ ఔషధాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. కంపెనీ త్వరలో హెచ్‌ఐవీ వ్యాప్తిని...
ఆమోదం తెలిపిన సీడీఎ్‌ససీఓ
భారీగా తగ్గనున్న ‘లెనాకాపవిర్’ ధర
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ తన జెనరిక్ ఔషధాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. కంపెనీ త్వరలో హెచ్‌ఐవీ వ్యాప్తిని అడ్డుకునే ‘లెనాకాపవిర్’ అనే జెనరిక్ ఇంజెక్షన్లను తయారు చేసి దేశ, విదేశాల్లో మార్కెట్ చేయనుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లేకుండానే కంపెనీ భారత్‌లో ఈ జెనరిక్ ఇంజెక్షన్లను తయారు చేసి, మార్కెట్ చేసేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) ఆమోదం తెలిపింది. డాక్టర్ రెడ్డీస్‌తో పాటు ఎంక్యూర్ ఫార్మాకి కూడా సీడీఎ్‌ససీఓ ఇందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఒక్కోటి రూ.3,500 వరకు ఉన్న ఈ ఇంజెక్షన్ల ధర 50 నుంచి 70 శాతం వరకు తగ్గుతుందని మార్కెట్ వర్గాల అంచనా.
పేటెంట్ ఔషధమే
హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగించే ‘లెనాకాపవిర్’ ఔషధంపై అంతర్జాతీయ ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్‌కు పేటెంట్ ఉంది. ఈ కంపెనీ ఎలాంటి రాయల్టీ లేకుండా ‘లెనాకాపవిర్’ను తయారు చేసి భారత్‌తో పాటు 120 అల్పాదాయ దేశాల్లో మార్కెట్ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్, హెటెరో ఫార్మాతో పాటు అనేక కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు లెనాకాపవిర్ జెనరిక్ ఇంజెక్షన్లను తయారు చేసి మార్కెట్ చేయబోతున్నాయి. హెచ్‌ఐవీ రోగులు ఏడాదికి రెండుసార్లు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. గిలీడ్.. అమెరికా, ఈయూ దేశాల్లో ఇదే ఇంజెక్షన్లను సన్‌లెంకా, ఎజ్‌టుగో బ్రాండ్ల పేరుతో 28,000 డాలర్ల నుంచి 42,000 డాలర్లకు (సుమారు రూ.27 లక్షల నుంచి రూ.40 లక్షలు) విక్రయిస్తోంది.
ఆరిజెన్ ఫార్మాకు భారీ ఆర్డర్
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అనుబంధ సంస్థ ఆరిజెన్ ఫార్మాకు భారీ కాంట్రాక్టు లభించింది. ఒక అంతర్జాతీయ కంపెనీకి దీర్ఘకాలం పాటు కాంట్రాక్టు పద్దతిలో స్టెరైల్ ఇంజెక్టబుల్స్, బయోలాజిక్స్ తయారు చేసి సరఫరా చేసే కాంట్రాక్టు లభించినట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. అయితే కాంట్రాక్టులోని షరతుల కారణంగా ఆ కంపెనీ పేరు వెల్లడించలేక పోతున్నట్టు తెలిపింది. ముందుగా 20 ఉత్పత్తులతో ప్రారంభమై.. తర్వాత మరిన్ని ఔషధాలను ఈ కాంట్రాక్టు కింద ఆ విదేశీ కంపెనీకి సరఫరా చేస్తామని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కాంట్రాక్టు ఆదాయం కంపెనీకి అందుతుందని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!