ఏప్రిల్ నెలాఖరుకల్లా 180 డాలర్లకు ముడి చమురు.. సౌదీ అధికారుల అంచనా
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:04 PM
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర ఏప్రిల్ నెలాఖరు నాటికి 180 డాలర్లకు చేరే అవకాశం ఉందని సౌదీ అధికారులు అంచనావేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముడి చమురు సరఫరాలో అంతరాయాలు దీర్ఘకాలికమన్న భయాలు పెరుగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై దాడులు పెరగడంతో ఈ ఆందోళన అధికమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 180 డాలర్లకు చేరుకోవచ్చని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి అధికారులు ధరల పెరుగుదలపై అంచనాలను రూపొందించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పరిస్థితులు ముదిరితే 180 డాలర్లకు మించి ధరల పెరుగుదల ఉండవచ్చని సౌదీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లలో ప్రామాణిక బ్రెంట్ క్రూడ్ ధర 110-120 డాలర్ల మధ్య తచ్చాడుతోంది. ప్రస్తుతం ముడిచమురు సరఫరాలో అవాంతరాలు దీర్ఘకాలికమనే అంచనాకు సౌదీ అధికారులు వచ్చారు.
ఈ అంచనాల ప్రకారం, సమీప భవిష్యత్తులో బ్రెంట్ క్రూడ్ ధర 140 డాలర్ల వరకూ ఎగబాకే అవకాశం ఉంది. ఏప్రిల్ ప్రారంభం నాటికి 150 డాలర్లకు బ్యారెల్ ధర చేరుకుంటుంది. ఆ తరువాత కూడా ఉద్రిక్తతలు కొనసాగితే ఏప్రిల్ చివరి నాటికి ధర 180 డాలర్లు దాటిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో సరఫరాకు తలెత్తే అడ్డంకులు, మార్కెట్ ప్రతిస్పందనలు వంటి వాటి ఆధారంగా సౌదీ అధికారులు ఈ అంచనాకు వచ్చారు. సౌదీ ప్రభుత్వ రంగ సంస్థ అరామ్కో ఏప్రిల్ 2న ముడి చమురు ధరలను సవరించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అరామ్‌కో చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలూ చదవండి
రికార్డు స్థాయి కనిష్ఠానికి రూపాయి!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ముసలం?