Share News

చల్లారుతున్న చమురు మంట

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:39 AM

పెరుగట విరుగుట కొరకే అనే సామెత ముడి చమురు ధర విషయంలో మరోసారి రుజువవుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడితో చుక్కలంటిన ముడి చమురు ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది....

చల్లారుతున్న చమురు మంట

70 డాలర్లకు బ్యారల్‌ ధర

మార్కెట్లో మళ్లీ ఇరాన్‌ క్రూడ్‌

మున్ముందు సెగ మరింత తగ్గే అవకాశం

దేశ ఆర్థిక వ్యవస్థకూ ఉపశమనం

న్యూఢిల్లీ: పెరుగట విరుగుట కొరకే అనే సామెత ముడి చమురు ధర విషయంలో మరోసారి రుజువవుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడితో చుక్కలంటిన ముడి చమురు ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 70 డాలర్లకు దిగి వచ్చింది. ఒక దశలో ఇది 69 డాలర్లకు చేరి ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని కూడా తాకింది. ఇది ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనపుడు ఉన్న ధర కంటే తక్కువ.

మరింత కిందికి!

తీవ్ర బేరసారాల తర్వాత ఎట్టకేలకు అమెరికా-ఇరాన్‌ మధ్య 60 రోజుల శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఇరాన్‌ కూడా తన వద్ద భారీగా పేరుకుపోయిన చమురును ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్‌ పెట్రోలియం శాఖ మంత్రి ఇందుకోసం ఇటీవలే మన దేశానికి వచ్చి వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే బ్యారల్‌కు 3 నుంచి 4 డాలర్ల డిస్కౌంట్‌తో భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధమని ఈ పర్యటనలో ఆయన భారత్‌కు ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు యుద్ధం చల్లారడంతో ఇతర గల్ఫ్‌ దేశాలూ భారీగా చమురు ఎగుమతులకు సిద్ధమయ్యాయి. దీంతో త్వరలోనే బ్యారల్‌ చమురు ధర 60 నుంచి 65 డాలర్లకు దిగి వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

వృద్ధికి ఊతం

ఈ యుద్ధంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థలు 6.5 శాతానికి కుదించేశాయి. ఇప్పుడు యుద్ధం చల్లారడంతో అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌.. భారత జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలనీ 4.6 శాతం నుంచి 4.4 శాతానికి కుదించింది. కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో 1.1 శాతం మించక పోవచ్చని తెలిపింది.


స్టాక్‌ మార్కెట్‌, రూపాయికీ మంచిదే

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇప్పుడు మళ్లీ గాడిన పడుతోంది. నిన్న మొన్నటి వరకు అమ్మకాలతో మార్కెట్‌ను కుదిపేసిన విదేశీ పోర్టుఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) మళ్లీ మన మార్కెట్లో పెట్టుబడులకు దిగారు. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం శాశ్వత ఒప్పందానికి దారితీస్తే నిఫ్టీ త్వరలోనే 25,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ గాడిన పడడంతో నిన్న మొన్నటి వరకు డాలర్‌తో ‘బేర్‌’మన్న రూపాయి మారకం రేటూ కోలుకుంటోంది. యుద్ధ సమయంలో ఒక దశలో డాలర్‌తో రూ.97 వరకు పడిపోయిన రూపాయి మారకం రేటు ప్రస్తుతం రూ.94.34 పైసలకు అటుఇటుగా ట్రేడవుతోంది. ఇది మరింత బలపడి త్వరలోనే రూ.94 వద్ద స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆటంకాలు

అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రస్తుతం కుదిరింది తాత్కాలిక సంధి మాత్రమే. రెండు నెలల్లోగా తుది ఒప్పందం కుదరకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభమై హోర్ముజ్‌ జలసంధి మూసుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మళ్లీ చమురు సెగ తప్పదు. ఈ ఆటంకాలు ఏవీ లేకపోతే అధిక ధరల వద్ద కొన్న చమురు నిల్వలు మరో రెండు మూడు నెలల్లో అయిపోయి.. ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


భారత్‌కు ఊరట

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేయనుంది. మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతానికి దిగుమతులే దిక్కు. ఈ దిగుమతుల్లో దాదాపు సగం గల్ఫ్‌ దేశాల నుంచే వస్తోంది. యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి మూసుకుపోవడంతో ఒక దశలో బ్యారల్‌ చమురు ధర 129 డాలర్లకు ఎగబాకింది. అంత ధర పెట్టినా సరఫరా ఆటంకాలు ఏర్పడి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌లకు కొరత ఏర్పడి ధరలు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు యుద్ధం చల్లారటంతో మన ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంటోంది.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 05:39 AM