క్రూడ్ పైపైకి.. సూచీలు కిందికి
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:31 AM
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు సన్నగిల్లుతుండటం తో ముడి చమురు ధరలు మళ్లీ 90 డాలర్ల దిశ గా పయనిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో...
సెన్సెక్స్ 388 పాయింట్లు డౌన్
90 డాలర్లకు చేరువలో చమురు ధర
ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు సన్నగిల్లుతుండటం తో ముడి చమురు ధరలు మళ్లీ 90 డాలర్ల దిశ గా పయనిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ఇది దెబ్బతీసింది. ఈ కారణంగా భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలూ మంగళవారం నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 494 పాయింట్ల మేర క్షీణించినప్పటికీ, చివరికి 388.19 పాయింట్ల నష్టంతో 78,154.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112.10 పాయింట్లు పతనమై 24,471.70 వద్దకు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో 2 శాతానికి పైగా ఎగబాకి 89.63 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
2 నెలల గరిష్ఠానికి బంగారం
దేశీయంగా పసిడి ధరలు వరుసగా ఆరో రోజూ ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మరో రూ.1,200 పెరుగుదలతో రూ.1,57,200కు చేరింది. పసిడికి ఇది రెండు నెలల (జూన్ 12 తర్వాత) గరిష్ఠ స్థాయి. గడిచిన 6 రోజుల్లో బంగారం ధర రూ.9,800 మేర (6.65 శాతం) పెరిగింది. కాగా, కిలో వెండి రూ.2,000 పెరిగి రూ.2.42 లక్షలు ధర పలికింది. వెండికి సైతం ఇది రెండు నెలలకు పైగా (ఏప్రిల్ 30 తర్వాత) గరిష్ఠ స్థాయి.
17 నుంచి లలితా జువెలరీ ఐపీఓ
ఇష్యూ ధరల శ్రేణి రూ.190-201
స్వర్ణాభరణాల విక్రయ కేంద్రాల నిర్వహణ సంస్థ లలితా జువెలరీ మార్ట్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 17న ప్రారంభమై 19న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.190 -201గా నిర్ణయించింది. ధరల శ్రేణి గరిష్ఠ స్థాయి ప్రకారంగా కంపెనీ రూ.11,250 కోట్లు విలువ చేయనుంది. ఐపీఓలో భాగంగా లలితా జువెలరీ రూ.1,200 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా మరో రూ.500 కోట్ల షేర్లను విక్రయించనుంది. మొత్తం రూ.1,700 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించిన నిధులను మరిన్ని జువెలరీ షోరూమ్‌ల ఏర్పాటు కోసం వినియోగించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నెల 24న సంస్థ తన షేర్లను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలో నమోదు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
దశాబ్దాల నష్టానికి పరిహారం చెల్లించాలి.. ఇరాన్ ముందు ట్రంప్ కొత్త డిమాండ్..
అమిత్ షా సభకు రావాలి.. విపక్షాల నినాదాలు..