క్రెడిట్ కార్డు చోరీతో నష్టం జరిగితే ఎలా?
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:32 AM
క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. కొందరికైతే ఒకటికి మించి కార్డులు ఉంటాయి. చేతిలో డబ్బు లేకున్నా సరే.. పర్సులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. అందులో ఉన్న...
క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. కొందరికైతే ఒకటికి మించి కార్డులు ఉంటాయి. చేతిలో డబ్బు లేకున్నా సరే.. పర్సులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. అందులో ఉన్న పరిమితి మేరకు నచ్చిన వాటిని కొనవచ్చు. తర్వాత నిర్దేశిత గడువు తేదీలోగా ఆ బిల్లును చెల్లిస్తే సరిపోతుంది. మన వాడకం, చెల్లింపులను బట్టి క్రెడిట్ పరిమితి క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బాగానే ఉంది.. మరి ఒకవేళ క్రెడిట్ కార్డు చోరీకి గురైతే? ఆ కార్డుతో ఎవరో మోసపూరితంగా కొనుగోళ్లు జరిపితే? అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? కార్డును పోగొట్టుకున్న వ్యక్తే చెల్లించాలా? బ్యాంకు నష్టాన్ని తిరిగి చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. వీటికి సమాధానం మాత్రం ఒకేలా ఉండదు. నష్టాన్ని భరించే విషయంలో ఒక పద్ధతి ఉంటుంది.
సమాచారమే కీలకం..
క్రెడిట్ కార్డుతో మోసపూరిత లావాదేవీలు జరిగిన సందర్భంలో కార్డుదారుడే తప్పనిసరిగా బాధ్యుడు కాకపోవచ్చు. ఆ మోసం ఎలా జరిగింది, మోసపూరిత లావాదేవీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు బ్యాంకుకు సమాచారమిచ్చారనే అంశాలపై బాధ్యత ఆధారపడిఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి రద్డీగా ఉండే ఒక ప్రదేశంలో క్రెడిట్ కార్డును పోగొట్టుకున్నాడనుకుందాం. అది పోయిందని గుర్తించేలోగా ఎవరో దాన్ని ఉపయోగించి కొనుగోళ్లు జరిపారు. తర్వాత కార్డుదారుడు ఆ లావాదేవీలను గుర్తించి కార్డును జారీ చేసిన బ్యాంకుకువెంటనే సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆ అనధికారిక లావాదేవీలు ఎలా జరిగాయనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. కార్డు పోయింది లేదా దొంగతనానికి గురైందని బ్యాంకుకు రిపోర్ట్ చేశాక కార్డును బ్లాక్ చేసిన తర్వాత జరిగే అనధికారిక లావాదేవీలకు సాధారణంగా బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ కార్డు పోయిందని రిపోర్ట్ చేయడానికి ముందు జరిగిన లావాదేవీలకు సంబంధించి ఎవరు బాధ్యత వహించాలనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు, కార్డు జారీ చేసే సంస్థ అమలు చేసే వినియోగదారుల రక్షణ విధానం ప్రకారం నిర్ధారిస్తారు.
ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
అనధికారిక ఎలక్ర్టానిక్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగిన సందర్భంలో కస్టమర్‌పై ఉండే బాధ్యతను పరిమితం చేసే లక్ష్యంతో ఆర్‌బీఐ నిబంధనలను రూపొందించింది. బ్యాంకు వైపు నుంచి నిర్లక్ష్యం లేదా లోపం వల్ల లావాదేవీ జరిగినట్టయితే కస్టమర్‌కు ఏ బాధ్యత ఉండకపోవచ్చు. బ్యాంకు లేదా కస్టమర్ తప్పిదం లేకుండా థర్డ్ పార్టీ ఉల్లంఘన జరిగిన సందర్భంలో అనధికారిక లావాదేవీ గురించి సమాచారం అందిన మూడు పని దినాల్లో ఖాతాదారు బ్యాంకుకు తెలియ జేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన అనేది ప్రతి సందర్భంలోనూ ఆటోమెటిక్ రిఫండ్‌కు హామీ ఉంటుందని భావించలేము.
ఒకవేళ కస్టమర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఉదాహరణకు కార్డు నంబరు, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ వివరాలను ఇతరులతో పంచుకోవడం వంటివి చేసినట్టయితే బ్యాంకుకు అనధికారిక లావాదేవీ గురించి రిపోర్ట్ చేసే వరకు జరిగే నష్టాన్ని కస్టమరే భరించాల్సి రావొచ్చు. అయితే అనధికారిక లావాదేవీ గురించి నివేదించిన అనంతరం జరిగే నష్టాలను ఆర్‌బీఐ నిబంధన ప్రకారం బ్యాంకు భరించాల్సి ఉంటుంది.
లావాదేవీ గురించిన సమాచారం తెలిసిన తర్వాత కస్టమర్ నాలుగు నుంచి ఏడు పని దినాల్లో బ్యాంకుకు రిపోర్ట్ చేసినట్టయితే ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితులు, ఖాతా స్వభావాన్ని బట్టి బాధ్యత పరిమితమై ఉంటుంది. ఒకవేళ ఏడు పని దినాలు దాటినట్టయితే సదరుబ్యాంకు బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం బాధ్యతను నిర్ధారిస్తారు.
కార్డు చోరీకి గురైతే ఏం చేయాలంటే?
ముందుగా కార్డును వెంటనే బ్లాక్ చేయాలి
ఇందుకు కార్డును జారీ చేసిన సంస్థ మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ప్రత్యేక హెల్ప్ లైన్, ఇతర మార్గాలను ఉపయోగించాలి.
అలాగే కస్టమర్లు తమ ఇటీవలి లావాదేవీలను ఒకసారి సరిచూసుకోవాలి. ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగినట్టు గుర్తిస్తే రిపోర్ట్ చేయాలి. ఫిర్యాదు నంబరు లేదా రిఫరెన్స్ నంబర్లను భద్రపరచుకోవాలి. నష్టాన్ని ఎవరు భరించాలన్న వివాదం తలెత్తినట్లయితే రిపోర్ట్ చేసిన సమయం చాలా కీలకంగా మారవచ్చు.
చేతుల కాలాక ఆకులు పట్టుకోవడంలా చేయకుండా.. తమ క్రెడిట్ కార్డు చోరీకి గురైందని గుర్తించిన వెంటనే స్పందించడం చాలా కీలకం. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల అనధికారిక లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..
క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్