25,000 ఫ్రెషర్ల నియామకాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:56 AM
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్‌లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్.. ఈ ఏడాదిలో 24,000-25,000 మంది ఫ్రెషర్లను...
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్‌లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్.. ఈ ఏడాదిలో 24,000-25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు బుధవారం తెలిపింది. 2025లో చేపట్టిన 20,000 నియామకాలతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. ‘‘ఫ్రెషర్లను అధిక సంఖ్యలో చేర్చుకుంటున్నాం. 2024తో పోలిస్తే 2025లో వీరి హైరింగ్‌ను మరింత పెంచాం. 2026లో గత ఏడాది కంటే పెంచాలనుకుంటున్నాం’’ అని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ అన్నారు. 2025 సెప్టెంబరుతో పోలిస్తే డిసెంబరు నాటికి కాగ్నిజెంట్ ఉద్యోగుల నికర సంఖ్య 1,800 పెరిగి 3,51,600కు చేరుకుంది.
19% పెరిగిన లాభం: 2025 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) కాగ్నిజెంట్ నికర ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18.7 శాతం వృద్ధితో 64.8 కోట్ల డాలర్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 4.9 శాతం పెరిగి 533.3 కోట్ల డాలర్లకు ఎగబాకింది. 2025 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో 2,110 కోట్లకు పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 2,214-2,266 కోట్ల డాలర్ల (4.9-7.4 శాతం వృద్ధి) శ్రేణిలో ఉండవచ్చని సంస్థ అంచనా వేసింది.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News