కాగ్నిజెంట్ గూటికి ఆస్ట్రేయా
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:43 AM
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్‌లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాల పెంపుపై...
ఒప్పందం విలువ రూ.5,690 కోట్లు?
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, భారత్‌లోనే అధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్ సర్వీసెస్ కంపెనీ ఆస్ట్రేయాను కొనుగోలు చేయనున్నట్లు బుధవారం త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా తెలిపింది. ఒప్పందం విలువను మాత్రం కాగ్నిజెంట్ వెల్లడించలేదు.. అయితే, ఈ డీల్ విలువ 60 కోట్ల డాలర్ల (రూ.5,690 కోట్లు) స్థాయిలో ఉండవచ్చని రాయిటర్స్ కథనం పేర్కొంది.
క్యూ1 లాభం 66.2 కోట్ల డాలర్లు: ఈ మార్చి తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో కాగ్నిజెంట్ ఏకీకృత నికర లాభం 66.2 కోట్ల డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన 66.3 కోట్ల డాలర్ల లాభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. క్యూ1 ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 5.8 శాతం వృద్ధితో 540 కోట్ల డాలర్లకు పెరిగింది. కాగా, ఈ ఏడాదిలో 25,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కాగ్నిజెంట్ ఈ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. ఈ మార్చి త్రైమాసికం లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య మరో 6,000 పెరిగి మొత్తం 3,57,600కు చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..