కోస్టల్’కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా
ABN , Publish Date - Sep 08 , 2026 | 03:56 AM
విజయవాడ కేంద్రంగా గత 26 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభించింది.
విజయవాడ-మొగల్రాజపురం (ఆంధ్రజ్యోతి): విజయవాడ కేంద్రంగా గత 26 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్‌కు షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా లభించింది. ఈ నెల 4న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ మేరకు ‘కోస్టల్’కు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ హోదా ప్రకటించిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ బీ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. సోమవారం నాడిక్కడ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్డ్ బ్యాంక్ హోదాతో వినియోగదారుల్లో విశ్వాసం పెరగటమే కాకుండా కార్యకలాపాల పరిధి మరింత విస్తృతమవుతుందన్నారు. నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ వంటి సంస్థల నుంచి అర్హతలకు లోబడి రీఫైనాన్స్ సేవలను వినియోగించటం ద్వారా గృహ, వ్యవసాయ రుణాలను అందించే అవకాశం కలుగుతుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 57 శాఖలను బ్యాంక్ నిర్వహిస్తోందన్నారు. తాజాగా విజయనగరం, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో కొత్తగా 13 శాఖలను ప్రారంభించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ సీఎ్‌ఫఓ కేఏవీ రామన్, సీఆర్‌ఓ వై సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.