అన్నిటికీ కామన్ ఐడీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:15 AM
కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా, బీమా పాలసీ తీసుకోవాలన్నా వరుస పెట్టి అప్లికేషన్లు నింపాల్సిందే. ఆధార్, పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందే. త్వరలో ఈ కసరత్తుకు తెరపడనుంది...
ఆగస్టు నుంచి సీకేవైసీ 2.0 విధానం!
ముందు బ్యాంకు, బీమా పాలసీలకు.. తర్వాత ఎంఎ్‌ఫలకు విస్తరణ
ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ కసరత్తు
న్యూఢిల్లీ: కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా, బీమా పాలసీ తీసుకోవాలన్నా వరుస పెట్టి అప్లికేషన్లు నింపాల్సిందే. ఆధార్, పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందే. త్వరలో ఈ కసరత్తుకు తెరపడనుంది. ‘సెంట్రల్ నౌ-యువర్ కస్టమర్ 2.0’ (సీకేవైసీ) పేరుతో ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, భారతీయ జీవిత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఇందుకోసం కసరత్తు చేస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే ఖాతాదారులు పదే పదే అప్లికేషన్లు నింపాల్సిన అవసరం లేకుండా.. ఒకే కామన్ నంబర్‌తో అన్ని రకాల ఆర్థిక సేవలు అందుకోవచ్చు. వచ్చే నెల నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు బ్యాంకులు, బీమా పాలసీలతో మొదలుపెట్టి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), బ్రోకరేజీ సంస్థలకు కూడా ఈ కామన్ నంబరు విధానాన్ని విస్తరిస్తారని భావిస్తున్నారు.
ఎలా పని చేస్తుందంటే..
ఖాతా తెరవక ముందే ఆయా వ్యక్తుల ఆధార్, పాన్ నంబరు, చిరునామా వివరాలు ఒక సెంట్రల్ రిజిస్ట్రీలో భద్రపరుస్తారు. కొత్తగా ఎవరికైనా బ్యాంకులో ఖాతా తెరవాలన్నా లేదా బీమా పాలసీ ఇవ్వాలన్నా బ్యాంకులు, బీమా సంస్థలు ఆయా వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఖాతాదారుల అనుమతితో మాత్రమే ఈ సెంట్రల్ రిజిస్ట్రీ నుంచి తీసుకుంటాయి. అది కూడా వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా మాత్రమే. ఒకవేళ అప్‌డేటెడ్ వివరాలు కావాలన్నా ఇదే పద్దతి అనుసరిస్తాయి.
ఇప్పటికే విదేశాల్లో..
సింగపూర్‌తో పాటు కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆయా దేశాల ప్రజలకు సంబంధించిన సీకేవైసీ వివరాలు ఆయా దేశాల సెంట్రల్ రిజిస్ట్రీల్లో ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా అక్కడి బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. సీకేవైసీ వివరాలు ఖాతాదారుల అనుమతితో మాత్రమే వెల్లడిస్తారు. వారి అనుమతి లేకుండా వెల్లడిస్తే సెంట్రల్ రిజిస్ట్రీపై పెద్ద మొత్తంలో జరిమానాలు, క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. కాబట్టి ఖాతాదారుల వివరాల గోప్యతకు పెద్దగా ముప్పు ఉండదు.
ఎందుకంటే ?
మన దేశ జనాభాలో 2024 నాటికే 84 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు గానీ, బీమా పాలసీలు గానీ, పెన్షన్ సదుపాయం గానీ లేదు. సెంట్రల్ రిజిస్ట్రీలో 120 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు ఉన్నాయి. అయితే ఈ డేటా సరైందా? కాదా? అనే సందేహాలు ఉన్నాయి దీంతో ముందుగా బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీ హోల్డర్ల వివరాలతో సీకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సీకేవైసీ అమల్లోకి వస్తే దేశ ఆర్థిక సేవల రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు