ఆన్‌లైన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఏడు కీలక మార్పులు!
ABN , Publish Date - Sep 10 , 2026 | 08:42 PM
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి ప్రయోజనాలను పరిరక్షించడం, పారదర్శకతను పెంచడం కోసం కేంద్రం 'వినియోగదారుల పరిరక్షణ నిబంధనలు 2026' ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, పారదర్శకతను పెంచడం కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్ సవరణ) నిబంధనలు, 2026' ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ నిబంధనల్లో ఆన్‌లైన్ షాపర్లు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన మార్పులు
1. నిజమైన డిస్కౌంట్ ధరల వివరాలు
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఏదైనా వస్తువుపై డిస్కౌంట్ ప్రకటించినప్పుడు, సవరించిన ధరతో పాటు దానికి ముందు ఉన్న ‘అసలు ధర’ (Prior Price) ను స్పష్టంగా చూపించాలి. డిస్కౌంట్ ప్రకటించడానికి ముందస్తుగా గడిచిన 30 రోజులలో ఆ వస్తువు విక్రయించిన అత్యంత తక్కువ ధరనే అసలు ధరగా పరిగణించాలి.
2. సెర్చ్ రిజల్ట్స్‌ను మేనిపులేట్ చేయడానికి వీల్లేదు
యూజర్లు ఒక వస్తువు కోసం వెతికినప్పుడు ప్లాట్‌ఫామ్‌లు తప్పుదోవ పట్టించేలా సెర్చ్ ఫలితాలను కావాలని మార్చడం లేదా ర్యాంకింగ్‌ను ప్రభావితం చేయడం నిషేధం.
3. స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్‌పై స్పష్టత
ఏదైనా ఉత్పత్తి ప్రకటన (Paid/Sponsored) ద్వారా సెర్చ్ రిజల్ట్స్‌లో నిలిస్తే, దానిని ‘స్పాన్సర్డ్’ అని స్పష్టంగా సూచించాలి. దీనివల్ల వినియోగదారులు సాధారణ ఫైండింగ్స్‌కు, డబ్బు చెల్లించి చూపించే ప్రమోషనల్ ప్రొడక్ట్స్‌కు తేడాను సులభంగా గుర్తించగలరు.
4. ‘డార్క్ ప్యాటర్న్స్’పై కఠిన ఆంక్షలు
వినియోగదారులను మోసం చేసేందుకు లేదా బలవంతంగా కొనుగోలు చేయించేందుకు ఉపయోగించే డిజిటల్ ట్రిక్స్ (‘డార్క్ ప్యాటర్న్స్’) ని నిరోధించేందుకు 2023 మార్గదర్శకాలను తప్పనిసరి చేశారు. ప్రతి ఈ-కామర్స్ సంస్థ ప్రతి సంవత్సరం ‘సెల్ఫ్-ఆడిట్’ నిర్వహించి కంప్లైయన్స్ సర్టిఫికెట్‌ను ప్లాట్‌ఫామ్‌పై ప్రదర్శించాలి.
5. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల వివరాలు (Country of Origin)
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు సంబంధించి, ఆ వస్తువు ఏ దేశానికి చెందింది (Country of Origin) దానిని దిగుమతి చేసుకున్న వారి (Importer) వివరాలను స్పష్టంగా చూపించాలి.
6. కొనుగోలుకు ముందే ఉత్పత్తుల సమగ్ర సమాచారం
వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుగా వస్తువుల ముగింపు తేదీలు (Best before/Use before dates), రిటర్న్, రీఫండ్ విధానాలు, వారంటీ, డెలివరీ, పేమెంట్ వివరాలను తప్పనిసరిగా వివరంగా అందించాలి.
7. అనుమతి లేని ఇతర రుసుములపై నిషేధం (No Bundled Fees)
యూజర్ల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధం లేని ఇతర సేవలకు అదనపు రుసుములను (ఆప్షనల్ ప్రీ-టిక్ చెక్‌బాక్స్‌లు వంటివి) యూజర్ స్పష్టమైన సమ్మతి లేకుండా జత చేయడాన్ని నిషేధించారు.
దీనితో పాటు, వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రతి ఈ-కామర్స్ సంస్థ 'నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్' (NCH) నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కావడం తప్పనిసరి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ