కరెన్సీయే కింగ్!
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:33 AM
గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో పెరిగినప్పటికీ, మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీ మాత్రం తగ్గలేదు. ఈ వైరుధ్యం భవిష్యత్ కరెన్సీ డిమాండ్‌ను...
డిజిటల్ చెల్లింపుల యుగంలోనూ పెరుగుతున్న నగదు చలామణి
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌సీ ముర్ము
ముంబై: గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో పెరిగినప్పటికీ, మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీ మాత్రం తగ్గలేదు. ఈ వైరుధ్యం భవిష్యత్ కరెన్సీ డిమాండ్‌ను అంచనా వేయడం కష్టతరంగా మార్చిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము అన్నారు. దీన్ని నగదు వైరుధ్యంగా ఆయన అభివర్ణించారు. బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా ఆధ్వర్యంలో ఈ నెల 13న జకార్తాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ముర్ము ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల వాటా తగ్గినప్పటికీ, చలామణిలో ఉన్న కరెన్సీ మాత్రం ఏటేటా రెండంకెల స్థాయిలో పెరుగుతూ పోతోంది. ఈ వైరుధ్య పరిస్థితి భవిష్యత్ కరెన్సీ డిమాండ్‌ను అంచనా వేయడం కష్టంగా మార్చింది. దాంతో నోట్ల ముద్రణ, సరఫరా ప్రణాళికను క్లిష్టతరంగా మార్చింద’’ని ముర్ము పేర్కొన్నారు.
కరెన్సీ డిమాండ్‌కు సంబంధించి ఆర్‌బీఐ ఐదేళ్ల అంచనాతో ముందుకెళ్తుందన్నారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం చలామణిలో ఉన్న నగదు విలువ 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.41.23 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో 12 శాతం పెరిగి రూ.41.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి యూపీఐ చెల్లింపుల సంఖ్య 21 శాతం పెరిగింది.
సదస్సులో ముర్ము ఇంకా ఏమన్నారంటే..
ప్రస్తుతం దేశంలో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రతి యేటా 2,800-3,000 కోట్ల నోట్లను ముద్రిస్తుంది. దాదాపు 2,100 కోట్ల చిరిగిన, పాడైన నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటుంది. కాగా, గత ఏడాది చివరి నాటికి అమెరికాలో 5,600 కోట్ల డాలర్ నోట్లు, యూర్‌పలో 3,000 కోట్ల యూరో నోట్లు చలామణిలో ఉన్నాయి.
ప్రధానంగా బ్యాంక్ నోట్ల జారీని నియంత్రించేందుకే 1935లో ఆర్‌బీఐ ఏర్పాటైంది. కరెన్సీ నోట్ల మన్నికను పెంచే మార్గాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే రూ.10, రూ.20 డినామినేషన్‌లో ప్లాస్టిక్ (పాలిమర్ కోటెడ్) నోట్లను ప్రవేశపెట్టబోతున్నాం.
కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీలో కర్బన ఉద్గారాలను తగ్గించే మార్గాలపైనా ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం